కార్యహాని కలిగించే శకునం
కాలం ఎంతమారినా కొన్ని విషయాల్లో పూర్వీకులను అనుసరిస్తూ వుండటం జరుగుతూ వుంటుంది. ముఖ్యంగా ఆచారవ్యవహారాల విషయంలోనూ ... శకునాల విషయంలోను పెద్దల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. పూర్వం ఎవరు ఏ పనిమీద వెళుతున్నా మంచి శకునం చూసుకుని బయలుదేరుతూ వుండేవాళ్లు.
మంచి శకునం ఎదురు రావడం వలన, తలపెట్టినకార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని భావించేవాళ్లు. అదే విశ్వాసం ఇప్పటికీ కొనసాగుతోంది. శకునం విషయంలో చాలామంది తమ పెద్దల మార్గాన్నే అనుసరిస్తూ వుంటారు. వ్యాపార వ్యవహారాల నిమిత్తమైనా ... శుభకార్యాల నిమిత్తమైనా బయలుదేరుతూ వున్నప్పుడు మంచి శకునం చూసుకుంటూ వుంటారు. మంగళప్రదమైన ధ్వనులు ... శుభప్రదమైన వస్తువులు ఎదురైనప్పుడు మంచి శకునాలుగా భావించి అడుగుబయటికి పెడుతుంటారు.
అలాగే కొన్ని శకునాలు కార్యహానిని కలిగించేవిగా చెప్పబడుతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడుతూ వుండగా ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా ఏడుపులు వినిపించినా ... ఏదో ఒక కారణంగా ఎవరైనా ఏడుస్తూ ఎదురుగా పరిగెత్తుకు వచ్చినా అది కార్య హానిని కలిగించే శకునంగా చెప్పబడుతోంది. అందుకే అలాంటి శకునం ఎదురైనప్పుడు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పబడుతోంది.