ఆలయంలో పాటించవలసిన నియమం

దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడం వలన సకలశుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే చాలామంది అనునిత్యం ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుని ఆ తరువాత తమ దినచర్యలను ఆరంభిస్తుంటారు. కొంతమంది వారంలో ఏదో ఒకరోజున ఆలయానికి వెళ్లివస్తుంటారు. మరికొందరు విశేషమైన పర్వదినాల్లో మాత్రమే దేవాలయానికి వెళుతూ వుంటారు. పూలు .. పండ్లు .. కానుకలు సమర్పించుకుని వెనుదిరుగుతుంటారు.

ఈ నేపథ్యంలోనే కొంతమంది తమ ఇంటి దగ్గర పులిహోర ... పొంగలి వంటివి తయారుచేసుకుని ఆలయానికి వచ్చి, గర్భాలయంలోని దైవానికి నైవేద్యంగా పెట్టమని అర్చకుడిని అడుగుతుంటారు. అలా తీసుకువచ్చిన పదార్థాలు నైవేద్యంగా పెట్టకూడదని అంటే అతనితో వాదనకి దిగుతుంటారు. తాము కూడా శుచిగానే తయారుచేశామని గొడవపడుతుంటారు.

భగవంతుడికి చేసే షోడశ ఉపచారాలలో నైవేద్యం ఒకటిగా చెప్పబడుతోంది. ఈ నైవేద్యాన్ని అర్చకుడు మడి కట్టుకుని నియమనిష్టలను పాటిస్తూ తయారుచేస్తాడు. సాధ్యమైనంత వరకూ ఈ మహానైవేద్యం ఆలయపరిధిలో గల వంటశాలలోనే తయారు చేయబడుతూ వుంటుంది. ఇక నైవేద్యమనేది తినడానికి వీలుగా వుండేంత వెచ్చగా ఉన్నప్పుడే భగవంతుడికి సమర్పించాలి. చల్లగా చల్లారిపోయిన నైవేద్యాలు భగవంతుడికి పెట్టకూడదు.

ఇలా భగవంతుడికి సమర్పించే మహానైవేద్యం నియమనిష్టలతో కూడినదిగా కనిపిస్తుంది. అందువలన ఇంటిదగ్గర తయారుచేసిన పదార్థాలు అక్కడి పూజామందిరం చెంతనే నైవేద్యంగా పెట్టాలి. ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేసిన దైవానికి వాటిని నైవేద్యంగా సమర్పించే ప్రయత్నాలు చేయకూడదు. భక్తులు ఎప్పుడూ భగవంతుడికి వివిధరకాల పండ్లను మాత్రమే నైవేద్యంగా తీసుకురావాలి. వాటిని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి, కొన్ని పండ్లను తిరిగి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ వుంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన దైవదర్శన ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పబడుతోంది.


More Bhakti News