అదే ఆ పరంధాముడి గొప్పతనం
రావణుడు పరమసాధ్వీమణి అయిన సీతమ్మను అపహరిస్తాడు. అది తప్పు అని ఎవరు ఎన్నివిధాలుగా చెప్పినా ఆయన వినిపించుకోడు. రాముడి శక్తిసామర్థ్యాలను గురించి తక్కువ అంచనా వేస్తాడు. రాముడు మహాపరాక్రమవంతుడనీ ... నరుడి రూపంలో వున్న నారాయణుడని అతనికి చెప్పడానికి విభీషణుడులాంటి వాళ్లు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతుంది.
ఫలితంగా రావణుడు యుద్ధంలో తన అనుచరులను .. సహచరులను .. సోదరులను .. పుత్రులను కోల్పోతాడు. రాముడితో ప్రత్యక్ష యుద్ధానికి దిగి ఆయన బాణాల ధాటికి తట్టుకోలేక కుప్పకూలిపోతాడు. అప్పటికే రాముడి ఆశ్రయాన్ని పొందిన విభీషణుడు తన సోదరుడి మృతికి కన్నీళ్ల పర్యంతమవుతాడు.
అసమానమైన భక్తితో మహాశివుడిని మెప్పించినవాడు ... తన శౌర్యపరాక్రమాలతో ఇంద్రాది దేవతలకు సైతం భయాన్ని కలిగించినవాడైన రావణుడు నిర్జీవంగా పడివుండటాన్ని తాను చూడలేకపోతున్నానని రాముడితో అంటాడు. దైవారాధనలో నియమ నిష్ఠలను ... ఆ దైవాన్ని కీర్తించడానికి అవసరమైన పాండిత్యాన్ని కలిగిన రావణుడు, సీతను అపహరించి ధర్మం తప్పడం విచారించదగిన విషయమని అంటాడు. అధర్మ మార్గంలో అడుగుపెట్టడం వల్లనే రావణుడు మృతిచెందాడనీ, అలాంటివాడికి తాను అంత్యక్రియలు జరిపించవచ్చునా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు.
యుద్ధరంగంలో రావణుడు ధైర్యంగా తన ఎదుట నిలిచి పోరాడి వీరస్వర్గాన్ని పొందాడు కనుక, అతని గురించి దుఃఖించవలసిన పనిలేదని విభీషణుడితో చెబుతాడు రాముడు. నిస్సందేహంగా అతను రావణుడి ఉత్తరక్రియలను జరిపించవచ్చని అంటాడు. శ్రీరాముడి ఆదేశం మేరకు విభీషణుడు ఆ కార్యక్రమాలను నిర్వహిస్తాడు. లోక కల్యాణం కోసం పరంధాముడు అవతారాలను ధరిస్తూ వుంటాడు. ధర్మరక్షణ కోసం అధర్మాన్ని ఆశ్రయించినవారిని అంతం చేస్తూ వుంటాడు. అంతే తప్ప ఆయనకి ఎవరిపట్లా ఎలాంటి ద్వేషభావం వుండదు. అదే ఆ పరంధాముడి గొప్పతనంగా కనిపిస్తూ వుంటుంది.