శనిదేవుడు ఇలా శాంతిస్తాడు
జీవితం ఆనందంగా ... హాయిగా సాగిపోవాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటూ వుంటారు. బాధలు ... కష్టాలు తమ దరిచేరకుండా చూడమని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ వుంటారు. అలాంటి పరిస్థితుల్లో తమకి 'శనిదోషం' వుందని తెలిస్తే ఎవరైనాసరే కంగారుపడిపోతారు. శని ప్రతికూల ఫలితాలను గురించి వినివుండటం వలన ఎంతగానో భయపడుతూ వుంటారు.
తమకి గల శనిదోషం కారణంగా ఏ పని చేయడం వలన ఎలాంటి ఫలితం వస్తుందోననే సందేహం వారిలో తలెత్తుతుంటుంది. దాంతో ధైర్యంగా అడుగు ముందుకు వేయలేక తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు. శనిదోష ప్రభావం నుంచి బయటపడటానికి గల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఆ మార్గాలలో ఒకటిగా సూర్యభగవానుడి ఆరాధన చెప్పబడుతోంది. సమస్త జీవులకు ఆహారాన్ని అందించు ప్రత్యక్షనారాయణుడు సూర్యభగవానుడే. అందువల్లనే వేదకాలం నుంచి ఆయన పూజలు అందుకుంటున్నాడు.
అలాంటి సూర్యభగవానుడి కొడుకే 'శనిదేవుడు'. తన తండ్రిని పూజించేవారికి అతని కుమారుడు అనుకూలంగా వుండటమనేది లోకంలో సహజంగా కనిపిస్తుంది. అలాగే సూర్యభగవానుడికి నమస్కరించేవారి పట్ల ... అంకితభావంతో ఆరాధించేవారి పట్ల శనిదేవుడు ప్రసన్నతను కలిగి ఉంటాడని చెప్పబడుతోంది. అందువలన శనిదోషం కారణంగా ఇబ్బందులు పడుతున్నవాళ్లు సూర్యభగవానుడిని పూజిస్తూ వుండటం వలన, శనిదోష ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుందని చెప్పబడుతోంది.