భగవంతుడు ఇలా ప్రసన్నుడవుతాడు

కోరికలు కలగడమనేది సర్వసాధారణంగా జరుగుతూ వుంటుంది. ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. మనసులో బలంగా వున్న కోరిక నెరవేరడం కోసం ఎంత శ్రమైనా చేస్తుంటారు ... ఎన్ని కష్టాలైనా పడుతుంటారు. తమ ప్రయత్నం వలన ఆ కోరిక నెరవేరకపోవచ్చని అనిపించినప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తుంటారు.

ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని, తమ మనసులోని మాటను దైవానికి చెప్పుకుంటారు. తమ కోరిక నెరవేరితే ఫలానా మొక్కు చెల్లిస్తానని అంటారు. ఇక ఆయనకి అప్పగించాం కనుక అంతా ఆయన చూసుకుంటాడని భావిస్తూ అక్కడి నుంచి వెనుదిరుగుతుంటారు. ఇలా ఒకసారి దేవుడికి దణ్ణం పెట్టుకుని మనసులో మాట చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందా అంటే, అది ఆ వ్యక్తికి గల అర్హతను బట్టి ఉంటుందని చెప్పవచ్చు.

ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అందుకు అవసరమైన అర్హతను సంపాదించుకోవడం ప్రతి విషయంలోనూ జరుగుతూ వుంటుంది. అలాగే ధర్మబద్ధమైన తన కోరికను గురించి భగవంతుడి దృష్టికి తీసుకువెళ్లి దానిని నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా అందుకు తగిన అర్హతను సంపాదించుకోవలసి వుంటుంది. భగవంతుడు చూపిన మార్గంలో నడవడమే ఆయనని వేడుకోవడానికి అవసరమైన అర్హతగా చెప్పుకోవచ్చు.

తోటివారిపట్ల ప్రేమను ... మూగజీవాలపట్ల సానుభూతిని కలిగివుండాలి. ఈర్ష్యా .. అసూయ .. ద్వేషాలకు .. వ్యసనాలకు దూరంగా వుండాలి. మాటలద్వారాగానీ ... చేతలద్వారాగాని ఎవరిని నొప్పించకుండా నడచుకోవాలి. సోమరితనాన్ని వదిలి శ్రమచేస్తూనే దైవకార్యాల్లో పాల్గొంటూ వుండాలి. ఈ విధంగా ఉత్తమమైన లక్షణాలను కలిగివుండి, నీతిబద్ధమైన .. నియమబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ వుండాలి. అప్పుడే అలాంటివారి కోరికను నెరవేర్చవచ్చని దైవానికి అనిపిస్తుంది ... ఆయన అనుగ్రహం లభిస్తుందని చెప్పబడుతోంది.


More Bhakti News