బాధలను నివారించే బంధువే బాబా
శిరిడీలోని మశీదులో వుంటూనే తన మంచితనంతో సాయిబాబా అందరినీ ఆకట్టుకున్నాడు. సాయి సాధారణమైన ఫకీరు కాదనీ ... సాక్షాత్తు దైవస్వరూపుడని గ్రహించిన ప్రజలు, ఆయనని ఆరాధించడం ఆరంభించారు. బాబాను విశ్వసిస్తూ వుండటం వలన ఆశించిన ప్రయోజనాలు చేకూరుతూ ఉండటంతో, భక్తుల సంఖ్య పెరుగుతూ రాసాగింది.
ఈ నేపథ్యంలోనే బాబా తన భక్తుల మధ్య సఖ్యతను పెంపొందింపజేయడానికిగాను ఎంతో కృషి చేశాడు. ఎవరి మనసు నొప్పించకుండా అందరికీ సంతోషాన్ని కలిగించడానికి ప్రయత్నించాడు. అంతా కలిసిమెలసి ఉన్నప్పుడే అసలైన పండుగ అనే విషయం అర్థమయ్యేలా చేశాడు. ఈ కారణంగానే నేడు అనేక ప్రాంతాలలో బాబా భక్త బృందాలు కనిపిస్తున్నాయి. బాబా ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి.
అలాంటి బాబా ఆలయాలలో ఒకటి కర్నూల్ జిల్లా 'నంద్యాల'లో కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో చక్కగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం మనసును కట్టిపడేస్తుంది. బాబా పట్లగల భక్తివిశ్వాసాలకు ఈ ఆలయం దర్పణం పడుతూ వుంటుంది. అభిషేకాలు .. అలంకారాలు ... హారతులు శిరిడీలో మాదిరిగానే జరుగుతుంటాయి. గురువారాల్లో మాత్రమే కాకుండా విశేషమైన పర్వదినాల్లో బాబాను దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.
ఎలాంటి సమస్యలు చుట్టుముట్టినా ఇక్కడి బాబాను దర్శించుకోవడం వలన అవి మబ్బుతెప్పల్లా తెలిపోతాయని చెబుతుంటారు. అంతా ఆయనని బాధలను నివారించే బంధువుగా భావిస్తూ వుంటారు. ఆయన మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు వరాల వర్షం కురిపిస్తూ ఉంటాడని అంటారు. అనునిత్యం ఆయన పాదాలను సేవిస్తూ ఆశీస్సులు అందుకుంటూ వుంటారు .. అనంతమైన ఆనందాన్ని పొందుతుంటారు.