మనసు మందిరంలో కొలువైన బాబా

ఈ రోజుల్లో ఏ గ్రామంలో చూసినా బాబా ఆలయాలు కనిపిస్తున్నాయి. కొంతమంది భక్తులు అంతకుముందుగల ఆలయ ప్రాంగణంలో బాబా మందిరాన్ని నిర్మిస్తుండగా, మరికొందరు భక్తులు బాబాకి ప్రత్యేక ఆలయ నిర్మాణం జరుపుతూ వస్తున్నారు. ఇక బాబా ఆలయమనేది ఎక్కడవున్నా అక్కడ భక్తుల అంకితభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది.

అభిషేకాలు .. అలంకారాలు ... హారతులు ... నైవేద్యాల విషయంలో భక్తులు ఎంతో శ్రద్ధతీసుకుంటూ వుంటారు. బాబాకి వస్త్రాలు ... పూలదండలు ... నైవేద్యాలను భక్తులు సమర్పిస్తూ ఆయనపై తమకి గల ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తుంటారు. ఇక ప్రతి గురువారం బాబా 'పల్లకీ సేవ' లో ఎక్కువమంది భక్తులు పాల్గొంటూ వుంటారు.

అప్పట్లోనే బాబా సన్నిహితులు ఆయనకి పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఆ పల్లకీలో తన పాదుకలు ఉంచడానికి మాత్రమే బాబా అంగీకరించాడు. అందువలన ఇప్పుడు ప్రతి బాబా ఆలయంలోను గురువారం రోజున పల్లకీలో ఆయన పాదుకలను వుంచి ప్రధాన వీధుల్లో ఊరేగింపును జరుపుతుంటారు. గ్రామాలలోను ... నగరాలలోని కాలనీల్లోనూ ఈ పల్లకీ ఉత్సవం సందడిగా జరుగుతూ వుంటుంది.

అన్ని వయసుల వారు ఈ పల్లకీ సేవలో పాల్గొంటూ వుంటారు. బాబా లీలావిశేషాలను గురించిన పాటలు పాడుతూ .. భజనలు చేస్తూ పల్లకీని అనుసరిస్తూ వుంటారు. బాబా పల్లకీని మోయడం వలన ... పల్లకీ సేవలో పాల్గొనడం వలన .. పల్లకీలో ఇంటి ముందుకి వచ్చిన బాబాకి హారతి ఇవ్వడం వలన మనోభీష్టం నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

బాబా పాదాలను ఆశ్రయించడం వలన ... పల్లకీసేవలో పాల్గొనడం వలన ఆయన అనుగ్రహం తమకి లభించిందనే విషయం భక్తుల అనుభవాలుగా వినిపిస్తుంటాయి. బాబా ఆలయానికి వెళితే ఆయన అక్కడి వేదికపైనే కాదు ... భక్తుల మనసు మందిరాల్లోను కొలువై వున్నాడనే విషయం స్పష్టమవుతుంది.


More Bhakti News