భక్తుల బాధలను స్వీకరించే బాబా
శిరిడీ సాయిబాబాను ఎంతోమంది ప్రేమిస్తారు ... ఆ ప్రేమతోనే ఆయనని ఆరాధిస్తారు ... అలా ఆరాధిస్తూనే ఆయనని సేవిస్తారు. శిరిడీసాయి అంటేనే విశ్వమంతటి ప్రేమకి నిదర్శనం ... అనంతమైన విశ్వాసానికి నిర్వచనం. బాబాని పూజిస్తే జరగని మేలు లేదు ... తొలగిపోని ఆపదలేదు అని ఈనాటి భక్తులు బలంగా నమ్మడానికి వెనుక, అప్పట్లో జరిగిన అనేక సంఘటనలు నిదర్శనంగా కనిపిస్తుంటాయి.
వ్యాధుల వలన కలిగే బాధలను సైతం ఆయన భక్తుల నుంచి స్వీకరించి వాళ్లకి ఉపశమనాన్ని కలిగించేవాడు. ఇక వాళ్లు ఆపదలో పడకుండా వాటిని కూడా ఆయనే ఎదుర్కునేవాడు. తన భక్తురాలి బిడ్డ కొలిమిలో పడబోతూ వుంటే, ఇక్కడి మశీదులోని 'ధుని'లో చేతులు పెట్టి, అక్కడి శిశువును రక్షించిన వాడాయన. ఆ సమయంలో ఆయన చేతులు కాలినా పెద్దగా బాధపడలేదు.
శిరిడీలో 'ప్లేగు' వ్యాధి విస్తరిస్తూ ఉండటంతో అక్కడి వాళ్లంతా తీవ్రమైన ఆందోళన చెందుతుంటారు. ఆ ప్లేగు వ్యాధిని అడ్డుకోవడంలో బాబా తనదైన పాత్రను పోషిస్తాడు. తనని విశ్వసించిన వాళ్లు ఆ వ్యాధిబారిన పడబోతుంటే దానిని ఆయన స్వీకరిస్తాడు. ఆయన శరీరంపై గల ప్లేగు బొబ్బలను చూసి భక్తులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇంతెందుకు .. మూగజీవాల బాధలను కూడా ఆయనే స్వీకరించాడనడానికి ఒక సంఘటన నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. బాబా పట్ల గల అభిమానంతో ఒకరు ఆయనకి గుర్రాన్ని కానుకగా ఇస్తారు. దానికి ముద్దుగా 'శ్యామసుందర్' అనే పేరు పెట్టిన బాబా, దాని బాధ్యతను ఒక వ్యక్తికి అప్పగిస్తాడు.
ఒకసారి ఆ వ్యక్తిని బాబా పిలిపించి ఆ గుర్రాన్ని అంతలా ఎందుకు కొట్టావని అడుగుతాడు. ఆ విషయం బాబాకి ఎలా తెలిసిందో అర్థంకాక అతను అయోమయానికి లోనవుతాడు. అది గమనించిన బాబా .. తన శరీరంపై తేలిన ఎర్రటి వాతలను చూపిస్తాడు. గుర్రాన్ని కొట్టిన దెబ్బలను బాబా స్వీకరించాడని తెలిసి ఆ వ్యక్తి ఎంతగానో బాధపడతాడు. ఇలా తనని ఆశ్రయించినవారు ఎలాంటి బాధలకు గురికాకుండా కంటికి రెప్పలా బాబా కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ ఇలాంటి అనుభవాలను తన భక్తులకు చూపుతూనే వున్నాడు. అందుకే అందరూ బాబా పాదాలను ఆశ్రయిస్తుంటారు ... ఆ కరుణామూర్తి కటాక్షాన్ని పొందుతుంటారు.