ఆటంకాలు ఇలా తొలగిపోతాయి
ఏదో ఒక పనిమీద ఇతర గ్రామాలకో ... నగరాలకో వెళ్లవలసిన అవసరం అందరికీ వస్తుంటుంది. తమ ప్రయాణానికి అవసరమైన అన్నిఏర్పాట్లను పూర్తిచేసుకుంటారు. మంచిశకునం చూసుకుని బయలుదేరుతారు. తాము వెళ్లేపని తప్పనిసరిగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వుంటారు. అలా ఎంతో ఆశతో ఇంటి నుంచి బయలుదేరిన వాళ్లకి ఎక్కడో ఒకచోట అనుకోని ఆటంకం ఎదురవుతుంది.
ఫలితంగా వెళ్లినవాళ్లు తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు. ఇక వెళ్లినది శుభకార్యం నిమిత్తమే అయితే, ఇంటి దగ్గర వాళ్లకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక డీలాపడిపోతుంటారు. ఎందుకంటే ఒక్కోసారి శుభకార్యం నిమిత్తం వెళ్లిన వ్యక్తి తెచ్చే శుభవార్త కోసం ఇంటిల్లిపాది ఆశగా ... ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాళ్లకు అనుకోని ఆటంకం గురించి ఎలా చెప్పాలా అనే ఆలోచన చేస్తూ వెళ్లినవాళ్లు తిరిగి వస్తుంటారు.
ఏదైనా ప్రయత్నం చేయడం మాత్రమే మనచేతిలో వుంది. అది ఫలించేది .. లేనిది భగవంతుడి అనుగ్రహం పైన ఆధారపడి వుందని అనుకోవడం సహజంగా జరుగుతూ వుంటుంది. ఇక ఇలా తలపెట్టినకార్యాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా ఉండాలంటే, ఆ పనిపై బయలుదేరుతూ పక్షులకు ఆహారాన్ని అందించడం మంచిదని పెద్దలు చెబుతుంటారు.
పక్షులకు ఆహారాన్ని అందించి బయలుదేరడం వలన ఆటంకాలు తొలగిపోయి, వెళ్లినపని విజయవంతంగా పూర్తవుతుందనే విశ్వాసం పూర్వకాలం నుంచీ ఉందనే విషయాన్ని గుర్తుచేస్తుంటారు. పక్షులకు ఆహారాన్ని అందించడం వలన కొన్ని దోషాలు నివారించబడతాయనీ, ఆటంకాలు కలిగించే ఆ దోషాలు తొలగిపోవడం వలన తలపెట్టినకార్యాలు పూర్తవుతూ ఉంటాయని చెబుతుంటారు.