భగవంతుడి సేవయే భాగ్యాన్ని ప్రసాదిస్తుంది
ఎవరికి వారు భగవంతుడిని తమ పరిణతినిబట్టి ... పద్ధతినిబట్టి సేవిస్తుంటారు. పండితులు ... పామరులు ... ధనిక .. పేద తారతమ్యాలు భగవంతుడి దృష్టిలో లేనేలేవు. అంకితభావాన్నిబట్టి అందరి సేవలను ఆయన స్వీకరిస్తుంటాడు. స్వామివారి సేవలకుగాను పెద్దమొత్తాల్లో సాయపడేవాళ్లను చూసి, అలా తాము చేయలేని పరిస్థితుల్లో వున్నందుకు బాధపడవలసిన పనిలేదు.
భక్తులు తమకి తోచిన విధంగా ... తమ స్తోమతకి తగినవిధంగా ఆయన సేవలో పాల్గొనవచ్చు. సాధారణంగా గ్రామాల్లోని ఆలయాల్లోనూ 'తిరునాళ్లు' జరుగుతూ వుంటాయి. ఈ ఉత్సవాల సమయంలో ఆలయానికి సున్నాలు ... రంగులు ... విద్యుత్ దీపాలు అవసరమవుతుంటాయి. ఇక పూలు .. పండ్లు .. అలంకరణ వస్తువులు కావలసి వస్తుంది.
వీటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నవారు, ఆ రోజున స్వామివారి కోసం కొంతవరకూ కేటాయించవచ్చు. ఇక ఇలాంటి పర్వదినాల్లో ఆయా దేవాలయాల్లో అన్నదానాలు జరుపుతుంటారు. ధాన్యం ... కూరగాయలు వంటివి పండించేవాళ్లు ఆ రోజున కొంతభాగాన్ని స్వామివారి సేవకు సమర్పించవచ్చు. మిగతావాళ్లు తమ ఆర్ధికస్తోమతని బట్టి, ఏవి అవసరమో తెలుసుకుని వాటిని అందజేయవచ్చు.
ఇలాదేవుడి సేవలో పాలుపంచుకోవడం అనంతమైన ఆనందాన్ని అందిస్తుంది. వారధి నిర్మాణంలో 'ఉడుత' కూడా తనవంతు సేవ చేసి స్వామి ఆత్మీయ స్పర్శను పొందింది. పేదరికం కారణంగా పరమాత్ముడికి అటుకులు సమర్పించిన కుచేలుడు స్వామి అనుగ్రహంతో శ్రీమంతుడయ్యాడు. అందుకే భగవంతుడిని శక్తికొలది సేవించాలి. అనిర్వచనీయమైన అనుభూతితో తరించాలి.