ఆలుమగల అన్యోన్యతను పెంచే ఆరాధన
ఏ ఇంట్లోనైనా అడుగుపెడితే అక్కడి వాతావరణం ప్రశాంతంగా అనిపించినా ... పవిత్రంగా కనిపించినా ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉందనే విషయం అర్థమైపోతుంటుంది. ఏ కుటుంబానికైనా భార్యాభర్తలు రెండు కళ్లవంటివాళ్లు. ఇద్దరిమధ్యా అనురాగం ... అవగాహన ఉన్నప్పుడే ఆ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా కొనసాగుతూ వుంటుంది.
ఇక ఎవరి తీరు వాళ్లదే అన్నట్టుగా వ్యవహరిస్తే, ఇద్దరూ కలిసి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచేదిగా 'అనంగ త్రయోదశి' కనిపిస్తుంది. చైత్రశుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశిగా పిలవబడుతోంది. ఈ రోజున మన్మథుడిని స్మరించుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
శివపార్వతుల కల్యాణం లోకకళ్యాణ కారకమైనప్పుడు, దేవతలు తలపెట్టిన ఆ ప్రయత్నంలో ప్రధానమైన పాత్రను పోషించినవాడు మన్మథుడు. సతీదేవి వియోగంతో తపస్సులోకి వెళ్లిన పరమశివుడిని అందులో నుంచి బయటికి తీసుకువచ్చి, ఆయన పార్వతీదేవి పట్ల అనురక్తుడయ్యేటట్లుగా చేసినది మన్మథుడు. అలాంటి మన్మథుడి కారణంగానే లోకంలో ఆలుమగల మధ్య అనురక్తి కలుగుతోంది.
ఈ నేపథ్యంలో మన్మథుడిని స్మరించుకునే రోజుగా ... మనస్ఫూర్తిగా ఆరాధించే రోజుగా అనంగత్రయోదశి చెప్పబడుతోంది. ఈ రోజున ఆయనని స్మరించుకోవడం వలన ఆలుమగల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుందనీ, వైవాహిక జీవితం సంతోషకరంగా ... సంతృప్తికరంగా సాగిపోతుందని స్పష్టం చేయబడుతోంది.