దైవారాధకులను బాధించకూడదు
భగవంతుడు తన ఆలయానికి రాలేదని నోచ్చుకోడు. తనకి నైవేద్యాలు పెట్టలేదని బాధపడడు. కానుకలు సమర్పించలేదని అసహనాన్ని వ్యక్తం చేయడు. మరి భగవంతుడు దేనికి బాధపడతాడు ? ఎందుకు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు ? అంటే .. తన భక్తుల మనసుకు కష్టం కలిగించినందుకు అనేది సమాధానంగా కనిపిస్తుంది.
నవవిధ భక్తిమార్గాలలో ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకుని తనని సేవిస్తూవున్నా, భగవంతుడు సంతోషిస్తూనే వుంటాడు. అలా తనని సేవిస్తోన్నవారిని ఎవరు ఇబ్బంది పెట్టినా ... బాధకలిగించినా భగవంతుడు ఎంతమాత్రం సంహించడు. అందువల్లనే పూర్వం మహర్షులు ప్రశాంతంగా తమ జపతపాలను కొనసాగించడం కోసం, రాజులు ... చక్రవర్తులు ప్రత్యేకమైన ప్రదేశాలను కేటాయించేవారు.
ఆధ్యాత్మిక ప్రపంచంగా భావించే ఆశ్రమాలకి తమ మనుషులను కాపలాగా ఉంచేవారు. అప్పుడప్పుడు ఆశ్రమాలను దర్శించి, వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ వుండేవారు. దైవారాధకులు ధర్మాన్ని ఆచరిస్తూ వుంటారు. అలాంటివారిని ఇబ్బందిపెడితే వర్షాలు పడవనీ ... కరవుకాటకాలు ఏర్పడతాయని భావించేవాళ్లు. అందువల్లనే దైవారాధనకీ ... దైవారాధకులకి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకునేవాళ్లు.
ఇందుకు ఒక ఉదాహరణగా అంబరీషుడిని చెప్పుకోవచ్చు. ధర్మపరుడు ... శ్రీమన్నారాయణుడికి మహాభక్తుడు అయిన అంబరీషుడిని, ఆయన సోదరుడు ఒక పథకం ప్రకారం అడవులకు పంపించేస్తాడు. ఫలితంగా ఆ రాజ్యంలో వర్షాలు పడకపోగా ... జలాశయాలు ఇంకిపోతాయి. తీవ్రమైన కరవు ఏర్పడటంతో ప్రజలు నానాఅవస్థలు పడతారు. ధర్మపరుడు .. దైవారాధకుడు అయిన అంబరీషుడు రాజ్యం వదలి వెళ్లిపోవడం వల్లనే ఈ దుస్థితి దాపరించిందని గ్రహించి ఆయనని సాదరంగా రాజ్యానికి తీసుకువస్తారు. ధర్మాన్ని ఆశ్రయించినవారికీ ... దైవాన్ని ఆశ్రయించినవారికి కీడు తలపెట్టకూడదనడానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది.