గణపతి ఆలయ ప్రదక్షిణ ఫలితం

సాధారణంగా పూజామందిరాల్లోను ... ఆలయాలలోను గణపతి తప్పనిసరిగా దర్శనమిస్తూ వుంటాడు. విద్య .. ఉద్యోగం .. వివాహం .. వ్యాపారం .. ఇలా దేనిలో అనుకున్న ఫలితాలను పొందాలన్నా అందుకు అడ్డుపడుతోన్న ఆటంకాలు తొలగిపోవాలి. అలాంటి ఆటంకాలు తొలగించే దైవంగా వినాయకుడు కనిపిస్తుంటాడు. అందుకే ప్రతిఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తూ వుంటారు.

అనునిత్యం ఇంటి దగ్గరే ఆ స్వామికి పూజాభిషేకాలు జరిపేవారు వున్నారు. అనుదినం ఆయన ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాతనే దైనందిన కార్యక్రమాలు ఆరంభించేవాళ్లూ వున్నారు. వినాయకుడి ఆశీస్సులతోనే ... అనుమతితోనే వాళ్లు ప్రతీకార్యాన్ని ప్రారంభిస్తుంటారు. ఇందువలన తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని విశ్వసిస్తుంటారు.

ఇలా వినాయకుడిని పూజించడం వలన కార్యాలు సఫలీకృతం కావడమే కాకుండా, గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది. వినాయకుడికి ప్రదక్షిణలు చేయడం వలన, కేతుగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. కేతుగ్రహ దోషం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అభివృద్ధిపరంగా అడుగుముందుకు పడకపోవడం ... అందుకు సంబంధించి చేసే పనుల్లో అవమానాలు ఎదురుకావడం జరుగుతూ వుంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో గణపతిని అంకితభావంతో పూజించడం వలన, కేతువు శాంతిస్తాడని చెప్పబడుతోంది. ఎందుకంటే కేతు గ్రహానికి అధిష్ఠాన దేవతగా 'గణపతి' వ్యవహరిస్తుంటాడు. అందువలన కేతుగ్రహ సంబంధమైన దోషంతో బాధలుపడేవాళ్లు, గణపతికి ప్రదక్షిణలు చేస్తూ .. పూజలు చేస్తూ సేవించడం వలన ఆశించిన ఫలితం అందుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News