ఈ రోజున హనుమంతుడిని ఆరాధించాలి

ఎవరి ఇంటికైనా వెళితే లోపలికి అడుగుపెట్టగానే ముందుగా హనుమంతుడి చిత్రపటమే దర్శనమిస్తుంది. ఇక ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా వుంటే, వాళ్ల మెడలో హనుమంతుడి 'రూపు'గల తాడు కనిపిస్తుంది. ఇక విద్యార్థి దశలో గల ఆడపిల్లలు సైతం, బయటికి వెళుతూ నుదుటున సిందూరం ధరిస్తుంటారు.

హనుమంతుడి చిత్రపటం ఇంట్లో వుండటం వలన ... ఆ స్వామి ముద్రను మెడలో ధరించడం వలన ... స్వామిని అభిషేకించిన సిందూరం నుదుటున పెట్టుకోవడం వలన దుష్టశక్తుల బారిన పడటం జరగదని అంతా విశ్వసిస్తుంటారు. ఇక హనుమంతుడికి ప్రదక్షిణలు చేయడం వలన, హనుమాన్ చాలీసాను పఠించడం వలన అనారోగ్యాలు ... గ్రహసంబంధమైన దోషాలు దూరమైపోతాయని భావిస్తుంటారు. ఇలా తన భక్తులను రక్షిస్తూ వుండే హనుమంతుడి జయంతిని అంతా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ వుంటారు.

ఉత్తరాది ప్రాంతానికి చెందినవాళ్లు 'చైత్ర పౌర్ణమి' రోజున ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ స్వామికి ఇష్టమైన పిండివంటలు పూజామందిరంలో నైవేద్యంగా సమర్పించి, ఆయనకి ప్రీతికరమైన పండ్లను ఆలయానికి తీసుకువెళుతుంటారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి 'సుందరకాండ' పారాయణ చేస్తుంటారు. ఈ విధంగా ఈ రోజున అంకితభావంతో హనుమంతుడిని ఆరాధించడం వలన, ఆ స్వామి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరతాయని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News