రాహుకేతువులు ఇలా శాంతిస్తారు !

సూర్యుడు .. చంద్రుడు .. కుజుడు .. బుధుడు .. గురుడు .. శుక్రుడు .. శని .. రాహువు .. కేతువు నవగ్రహాలుగా చెప్పబడుతున్నాయి. మానవుడి జీవన విధానాన్ని ఈ నవగ్రహాలు ప్రభావితం చేస్తుంటాయి. గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వడం వలన జీవితం సాఫీగా సాగిపోతే, ప్రతికూల ఫలితాలను ఇవ్వడం వలన నానాఇబ్బందులు పడవలసి వస్తూ వుంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ నవగ్రహాల అనుగ్రహాన్ని ఆశిస్తూ వుంటారు.

నవగ్రహాలలో చివరివిగా చెప్పబడుతోన్న రాహువు ... కేతువులు ఛాయా గ్రహాలుగా చెప్పబడుతూ వున్నా, ఇవి తమదైన ప్రభావాన్ని చూపుతుంటాయి. రాహువు ... కేతువు ప్రతికూల ఫలితాల వలన అనేక కష్టనష్టాలు ఎదురవుతుంటాయి. అనారోగ్య సమస్యలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు ... అనుకోని ఆపదలు ... అవమానాలు కలిగిస్తూ సతమతం చేస్తుంటాయి. ఈ బాధలను భరించడం అంతతేలిక కాదు. అందువలన ఈ గ్రహసంబంధమైన దోషాల బారినపడినవాళ్లు తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు.

ఈ దోషాల నివారణ ఆయా గ్రహాలను శాంతింపజేయడంపై ఆధారపడి వుంటుంది. దానిని బట్టి ఎవరి పరిధిలో వాళ్లు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రాహు కేతు దోషాల బారి నుంచి బయటపడటానికి అనేక మార్గాలు చెప్పబడుతున్నాయి. ఆయా గ్రహాలకి సంబంధించిన ధాన్యాలను దానం చేయడమనేది వాటిలో ఒకటిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 'మినుములు' దానం చేయడం వలన రాహువు, 'ఉలవలు' దానం చేయడం వలన కేతువు శాంతిస్తారు. రాహువు .. కేతువు శాంతించడం వలన ప్రతికూల ఫలితాల ప్రభావం తగ్గుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News