అదంతా భగవంతుడి లీలావిశేషమే !

జీవితం ప్రతి దశలోనూ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ వుంటుంది. పరిస్థితులు మారిపోతూ వుండటం వలన, వాటి బారిన పడిన వ్యక్తుల ధోరణిలోను మార్పు వస్తుంటుంది. ఇలా ప్రభావితం చేసే కొన్ని సంఘటనల వలన, మహాభక్తులుగా మారిపోయినవాళ్లు ఎంతోమంది వున్నారు. అలాంటివారిలో వరదయ్య (క్షేత్రయ్య) .. తులసీదాసు ... కనకదాసు తదితరులు కనిపిస్తుంటారు.

వరదయ్యకి చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ వుండటం ఇష్టం. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆయన ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటాడు. ఆ విషయంలో తీవ్రమైన నిరాశ ఎదురుకావడంతో, తన మనసును భగవంతుడి యందు లగ్నం చేస్తాడు. వేణుగోపాల స్వామిని ఆరాధిస్తూ ... కీర్తిస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటాడు.

ఇక బాల్యం నుంచి కాస్త భక్తిభావం ఉన్నప్పటికీ, వివాహమైన తరువాత సంసార వ్యామోహానికి తులసీదాసు చిక్కుతాడు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆయనని ఆ వ్యామోహం నుంచి బయటపడేస్తుంది. తన అజ్ఞానాన్ని తొలగించిన భార్యకి కృతజ్ఞతలు తెలియజేసి ఇల్లువదిలి వెళ్లిపోయిన ఆయన, రాముడి ఆరాధనకే తన జీవితాన్ని అంకితం చేసి తరిస్తాడు.

ఇక బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్న కనకదాసు ఆలనాపాలన తల్లే చూస్తుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆయన ఒక యువతికి మనసిస్తాడు .. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఆయన ఆలోచన విధానమే మారిపోతుంది. అసలైన ఆనందం భగవంతుడి పాదసేవలో మాత్రమే లభిస్తుందని భావించిన ఆయన, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తాడు. ఆదికేశవస్వామిని సేవిస్తూ ఆయనలోనే ఐక్యమైపోతాడు.

ఇలా జీవితంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు ఎదురైనప్పుడు, పూర్వజన్మ సుకృతం కారణంగా తిరిగి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి భగవంతుడి సన్నిధికి చేరుకున్న మహానుభావులు ఎంతోమంది వున్నారు. వాళ్ల అడుగుజాడలు భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూనే వుంటాయి. భగవంతుడి లీలావిశేషాలను ఆవిష్కరిస్తూనే వుంటాయి.


More Bhakti News