అలా ఇక్కడి దేవుడు అనుగ్రహిస్తాడు

కష్టమనేది భగవంతుడిని గుర్తుచేసి ఆయనని చేరుకునే మార్గాన్ని కలుపుతుంది. ఆ కష్టం తీరిన తరువాత, దైవం పట్ల గల విశ్వాసంతో వాళ్లు ప్రశాంతంగా ఆరాధించడం మొదలుపెడతారు. తమకి విశ్వాసాన్ని కలిగించిన క్షేత్రానికి తరచూ వెళ్లి దైవదర్శనం చేసుకుని వస్తుంటారు. క్షేత్రమేదైనా ... దైవమేదైనా భక్తులు కోరుకునేది తమ బాధలు తీర్చమనే.

భగవంతుడు భక్తుల అంకితభావాన్నిబట్టి, వాళ్ల కోరికలను నెరవేర్చుతూ వుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని క్షేత్రాలు .. కొన్ని మనోభీష్టాలను నెరవేర్చడంలో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా 'కురవి' కనిపిస్తుంటుంది. వరంగల్ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో 'వీరభద్రస్వామి' దర్శనమిస్తుంటాడు. కోరినవరాలను అందించే కొంగుబంగారంగా ఇక్కడి స్వామిని గురించి చెబుతుంటారు.

ముఖ్యంగా ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన సంతాన భాగ్యం కలుగుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తూ వుంటుంది. సంతాన లేమితో బాధపడుతోన్న భక్తులు ఇక్కడి ఆలయం చుట్టూ 'పొర్లు దణ్ణాలు' పెడుతుంటారు. సాధారణంగా సంతానాన్ని కోరుకునేవారు, ఆయా ఆలయాల ప్రాంగణంలో గల చెట్లకు బొమ్మ ఊయల కడుతూ వుంటారు. తమ ఇంట ఊయల ఊగేలా చేయమని కోరుతుంటారు.

ఈ క్షేత్రంలో ఇలా పొర్లుదణ్ణాలు పెడుతూ, తమ మనసులోని మాటను దైవానికి చెప్పుకుంటూ వుంటారు. ఇలా పొర్లు దణ్ణాలు పెట్టడం వలన వీరభద్రుడు తప్పనిసరిగా సంతానాన్ని అనుగ్రహిస్తాడని అంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ మొక్కుబడులు చెల్లించేవారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తూ వుంటుంది. అందువల్లనే ఆధ్యాత్మిక వైభవం .. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని చెబుతుంటారు.


More Bhakti News