కోరిన వరాలనిచ్చే హనుమంతుడు
ఎవరైనా సరే బుద్ధికీ ... బలానికి హనుమంతుడి పేరును ఉదాహరణగా చెప్పుకుంటూ వుంటారు. ఎందుకంటే ఎప్పుడు బలాన్ని ప్రయోగించాలో ... ఎప్పుడు బుద్ధిని ఉపయోగించాలో హనుమంతుడికి బాగా తెలుసు. సమయము ... సందర్భమును బట్టి ఆయన నడచుకున్న తీరు, సాక్షాత్తు రాముడి అభినందనలు అందుకునేలా చేసింది.
అందుకే హనుమంతుడిని పూజించడం వలన బుద్ధి .. బలము .. యశస్సు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రామావతారాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడిని నిస్వార్థంతో ప్రత్యక్షంగా సేవించిన భాగ్యశాలి హనుమంతుడు. ఇక రామావతార కార్యంలో ఆయనకి సహకరించడానికి వచ్చిన శివాంశ సంభూతుడుగా కూడా ఆయన చెప్పబడుతుంటాడు. అందువలన భూత ప్రేత పిశాచాలు ఆయన భక్తుల దరిదాపుల్లోకి రావు.
సమస్త లోకాలకు వెలుగును పంచే సూర్యభగవానుడి ప్రియశిష్యుడుగా కూడా హనుమంతుడు చెప్పబడుతున్నాడు. అందువలన హనుమంతుడిని పూజించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి. 'కుజదోషం' గలవారు మంగళవారం రోజున, 'శనిదోషం' తో ఇబ్బందులు పడుతోన్న వాళ్లు శనివారం రోజున స్వామిని పూజించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.
ఈ కారణంగానే ఈ రెండు రోజుల్లో భక్తులు హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తుంటారు. తమలపాకులు ఆయనకి చల్లదనాన్ని ఇస్తుంటాయి గనుక, వాటితో ఆయనని అర్చిస్తుంటారు. ఇక హనుమంతుడికి సంతోషాన్ని కలిగించే సిందూరాభిషేకం జరిపించే వాళ్లు కూడా ఎక్కువగానే వుంటారు. స్వామికి అప్పాలు ... వడలు .. అంటే ఎంతో ఇష్టమని చెప్పబడుతోంది. అందువలన ఆయన ఆలయాల్లో వాటిని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. మంగళ .. శనివారాల్లో అప్పాలను గానీ, వడలను గాని చేయించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వలన ఆయన ప్రీతి చెందుతాడని అంటారు. హనుమంతుడి అనుగ్రహముంటే, ఆయురారోగ్యాలతో జీవితం ఆనందంగా సాగిపోతుందని విశ్వసిస్తుంటారు.