అది భక్తులకు లభించిన అదృష్టం !

ధర్మస్వరూపంగా చెప్పబడుతోన్న శ్రీరామచంద్రుడు, తన గుణవిశేషాల చేత కోట్లాది మంది హృదయాలను దోచుకున్నాడు. అందువల్లనే ప్రతి గ్రామం ఆయన ఆలయానికి చోటిచ్చి మురిసిపోతుంటుంది. విశేషమైన పర్వదినాల్లో సీతారాముల క్షేత్రంలో ప్రత్యేక పూజలు ... సేవలు జరుగుతుంటాయి. ఇక ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా కొన్ని క్షేత్రాల్లో 'తిరునాళ్ల' జరుగుతూ వుంటుంది.

పౌరాణికంగాను ... చారిత్రకంగాను గల వైభవాన్ని బట్టి, కొన్ని క్షేత్రాల్లో మూడురోజులు .. మరికొన్ని క్షేత్రాల్లో అయిదురోజులు .. తొమ్మిదిరోజులు జరుపుతుంటారు. ఒక్కోరోజున ఒక్కో వాహనంపై సీతారాములను ఊరేగిస్తూ వుంటారు. వాటిలో హనుమ .. గరుడ .. అశ్వ .. గజ .. మొదలైన వాహనాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ వాహన సేవలకి ఆలయసిబ్బంది సరిపోతుంటారు. మిగతా గ్రామస్తులు ఉత్సవాన్ని తిలకిస్తూ సంతోషిస్తుంటారు.

ఇక 'రథోత్సవం' లో గ్రామస్తులందరికీ పాల్గొనే అవకాశం లభిస్తుంది. భక్తి ... ఉత్సాహం వున్న వాళ్లు రథానికి రెండువైపులా గల తాళ్లు పట్టుకుని స్వామివారి నామస్మరణ చేస్తూ లాగుతూ వుంటారు. అలా లాగుతూ వున్నప్పుడు రథానికి గల చిరుగంటలు మోగుతూ అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తూ వుంటాయి. భగవంతుడు తన సేవ చేసుకునే భాగ్యాన్ని అందరికీ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రథోత్సవం జరుపుకుంటున్నాడని అనిపించకమానదు.

స్వామివారి రథోత్సవంలో పాల్గొనడం వలన సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది. అంతే కాకుండా రథంపై ఊరేగుతూ వస్తోన్న నారాయణుడిని దర్శించడం వలన పునర్జన్మ ఉండదని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి విశేషాన్ని సంతరించుకున్నరథోత్సవంలో పాల్గొనే అవకాశం లభించడం భక్తులు తమ అదృష్టంగా భావిస్తుంటారు ... తమ పూర్వజన్మ పుణ్యఫలంగా విశ్వసిస్తుంటారు.


More Bhakti News