అదే భగవంతుడి గొప్పతనం

భగవంతుడు ఎంతో గొప్పవాడు ... సర్వాంతర్యామి. అనంతమైన ఈ విశ్వంలో ... అందమైన ఈ ప్రకృతిలో ఆయన ఎక్కడైనా ఉండగల సమర్థుడు. అయినా భక్తుల హృదయాల్లో ఉండటానికే ఆయన ఎక్కువ ఇష్టపడతాడు. ఈ సృష్టిలోని సమస్త జీవరాశులన్నీ ఆయనకి సంబంధించినవే ... సకల వస్తురాశి ఆయనకి చెందినదే. ఆయనది కాదు ... ఆయనకి సంబంధం లేదు అనేది ఏదీ ఎక్కడి నుంచీ ఎవరూ తీసుకురాలేరు.

అలాంటి భగవంతుడి నామం మధురం ... రూపం మనోహరం. ఆయన వైపు ఒకసారి మనసు మళ్లాక ... ఆయన సాన్నిహిత్యంలో గల అనుభూతిని పొందాక ఇక ఎవరూ భగవంతుడి నుంచి విడదీయలేరు. అలా భగవంతుడి కోసం అందరినీ ... అన్నింటినీ వదులుకున్న భక్తులు ఎంతోమంది వున్నారు.

కొంతమంది రాజులు .. తమకిగల అధికారాన్ని ఉపయోగించి మహాభక్తులను ఆస్థానానికి పరిమితం చేయాలని అనుకున్నారు. మరికొందరు రాజులు ఖరీదైన కానుకలను పంపించి, ఆ భక్తులపై తమకిగల ఆదరాభిమానాలను చాటాలనుకున్నారు. సంపదలు ... సుఖాలపట్ల ఎలాంటి వ్యామోహం లేని భక్తుల దృష్టిలో బంగారానికీ ... మట్టికి తేడా ఉండదని గ్రహించారు.

భక్తులకు కావలసినవి అవే అయితే అవి క్షణాల్లో భగవంతుడు వారికి ఏర్పాటు చేయగలడు. అలాంటప్పుడు వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని భావించి, ఆ మహాభక్తుల సేవలో తరించిన వాళ్లున్నారు. ఇలా భక్తులకు ఎటు నుంచి ఎలాంటి పరీక్షలు ఎదురైనా, చివరికి వారికి గల విశ్వాసమే గెలుస్తూ వచ్చింది. అదే భక్తుల గొప్పతనం ... వాళ్లు ఆశ్రయించిన భగవంతుడి గొప్పతనం.


More Bhakti News