చైత్ర పౌర్ణమి ప్రత్యేకత అదే !
చైత్రమాసం ఎంతో విశిష్టతను ... మరెంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ మాసంలో ప్రకృతి కొత్తఅందాలను సంతరించుకుని కనువిందుచేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన ఆహారాన్నే కాదు, మనసు కోరుకునే ఆహ్లాదాన్ని కూడా అందిస్తుంది. చైత్రమాసంలో తొలిరోజున ఉగాది పండుగ, నవమి రోజున సీతారామ కల్యాణ మహోత్సవం అంతా కలిసి ఆనందంగా జరుపుకుంటారు. ఇక ఈ మాసంలో గల 'పౌర్ణమి' కూడా ఎంతో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.
ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శివపార్వతులు ఆదిదంపతులు ... వారి అనుగ్రహంతోనే జీవుల మనుగడ కొనసాగుతూ వుంటుంది. స్వామివారి అనుగ్రహంతోనే భక్తుల పాపాలు పటాపంచలై పోతుంటాయి ... వాళ్లకి ఉత్తమగతులు కలుగుతుంటాయి. ఇక అమ్మవారి చల్లనిచూపు వలన సంపదలు ... సంతాన సౌభాగ్యాలు లభిస్తూ వుంటాయి.
అందుకే ప్రతి సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులకు పూజాభిషేకాలు జరిపించడమే కాకుండా, నోములు .. వ్రతాల ద్వారా కూడా ఆదిదంపతుల సేవాభాగ్యాన్ని పొందుతుంటారు. ఇక చైత్ర పౌర్ణమి రోజున మాత్రం శివాలయాలను దర్శించి ఉమామహేశ్వరులకు కల్యాణోత్సవం జరిపిస్తుంటారు. ఈ వేడుకను నిర్వహించడం వలన ... కనులారా దర్శించడం వలన శివపార్వతుల ఆశీస్సులు లభిస్తాయి. ఆలుమగల మధ్యగల అన్యోన్యత మరింత బలపడటమే కాకుండా, సంతాన భాగ్యం కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.