అప్పుల నుంచి విముక్తిని కల్పించే రుద్రాక్ష

పరమశివుడి వలన ఉద్భవించిన రుద్రాక్షలు ఎంతో శక్తిమంతమైనవిగా ... మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. వీటిని ధరించడం వలన అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయనే విషయం ప్రాచీనకాలంలోనే స్పష్టం చేయబడింది. అందువల్లనే దేవతలు ... మహర్షులు ... మునులు ... మహారాజులు వీటిని ధరిస్తూ వచ్చారు.

ఏ రుద్రాక్ష అయినా దానికి గల ముఖాలనుబట్టి .. దైవస్వరూపాన్నిబట్టి .. అధిదేవతలనుబట్టి ఆయా గుణవిశేషాలను కలిగివుంటుంది. ఆ విశేషాలనుబట్టే ప్రతిఒక్కరూ తమకి అవసరమైన రుద్రాక్షను ఎంపిక చేసుకుని ధరిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో రుణబాధల నుంచి విముక్తిని కలిగించే రుద్రాక్షగా ' త్రయోదశ ముఖి' కనిపిస్తుంది. ఇది మనోభీష్టాన్ని నెరవేర్చేదిగానే కాకుండా, అప్పుల నుంచి విముక్తిని కలిగించే శక్తిని కలిగి ఉంటుందని చెప్పబడుతోంది.

అవసరం వచ్చినప్పుడో .. ఆపద వచ్చినప్పుడో ఒక్కోసారి అప్పుచేయవలసి వస్తూ వుంటుంది. ఇస్తామని చెప్పిన సమయానికి ఆ సొమ్మును తిరిగి చెల్లించే అవకాశం లేనప్పుడు, మరోచోట అప్పుచేసి దానిని తీర్చడం చేస్తుంటారు. అప్పు చేయడం అలవాటులేని వాళ్లు కూడా ఇలా నానాఅవస్థలు పడవలసి వస్తూ వుంటుంది. ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కావడంతో తీవ్రమైన మానసిక వత్తిడికి లోనవుతుంటారు. అప్పుల బాధ నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ వుంటారు.

ఇలా రుణభారంతో సతమతమైపోయేవాళ్లు త్రయోదశముఖి రుద్రాక్షను ధరించడం వలన ఆశించిన ప్రయోజనం కనిపిస్తుందని చెప్పబడుతోంది. ఏ రుద్రాక్షనైనా ముందుగా శుద్ధిచేసి మంత్ర పూర్వకంగా దైవసన్నిధిలో ధరిస్తూ వుంటారు. అలా ధరించిన రుద్రాక్షను నియమనిష్టలను పాటిస్తూ పవిత్రంగా చూసుకుంటూ వుండాలి. అప్పుడే అది ఆరోగ్యపరంగాను ... ఆధ్యాత్మిక పరంగాను మంచి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.


More Bhakti News