సౌభాగ్యానికి రక్షణనిచ్చే ఏకాదశి
స్త్రీలు తమ సౌభాగ్యానికి ఇచ్చినంత విలువను ... ప్రాధాన్యతను మరి దేనికీ ఇవ్వరు. ఏ క్షేత్రానికి వెళ్లినా ... ఏ దైవాన్ని దర్శించినా వాళ్లు కోరుకునే మొదటి కోరిక తమ సౌభాగ్యాన్ని గురించే. ఏ పూజచేసినా .. ఏ నోము నోచినా తమ సౌభాగ్యాన్ని కలకాలం కాపాడుతూ ఉండమనే ప్రార్ధనే అందులో ప్రధానంగా కనిపిస్తుంది.
స్త్రీలు అమ్మవారి ఆలయాలను ఎక్కువగా దర్శించుకోవడం .. అమ్మవారికి చీరసారెలు సమర్పించడం ... శుక్రవారాల్లో కుంకుమ పూజలు చేయించడంలోని ప్రధానమైన ఉద్దేశం తమ సౌభాగ్యాన్ని రక్షించమనే. వారి మనోభీష్టాన్ని నెరవేర్చేదిగా 'కామదా ఏకాదశి' కనిపిస్తుంది. చైత్రశుద్ధ ఏకాదశిని కామదా ఏకాదశిగా చెబుతుంటారు.
ఈ ఏకాదశి రోజున ఉపవాస జాగరణలతో శ్రీమన్నారాయణుడిని సేవించాలి. అత్యంత భక్తిశ్రద్ధలతో నియమనిష్టలను ఆచరిస్తూ ఈ వ్రతాన్ని చేయడం వలన, వైధవ్య దోషం దరిచేరదని చెప్పబడుతోంది. అందువలన స్త్రీలు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వుంటారు. దగ్గరలోని వైష్ణవ క్షేత్రాలను దర్శించి పూజాభిషేకాలు జరుపుతుంటారు. ఆ స్వామి నామస్మరణ చేస్తూ .. ఆయన లీలావిశేషాలను కీర్తిస్తూ జాగరణ చేస్తుంటారు. ఆ పుణ్యఫల విశేషంగా సౌభాగ్య రక్షణను పొందుతుంటారు.