కృష్ణుడు ఇచ్చిన రాముడి విగ్రహం !
శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో రామావతారం ... కృష్ణావతారం పూర్ణావతారాలుగా చెప్పబడుతున్నాయి. ధర్మాన్ని రక్షించడం కోసం ... ధర్మమే రక్షిస్తుందని చెప్పడం కోసం రామావతార కార్యం కొనసాగింది. ఇక ధర్మసంస్థాపనే ధ్యేయంగా కృష్ణావతారం కనిపిస్తుంది.
త్రేతాయుగంలో ధర్మరక్షణ చేసిన రాముడే ... ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించాడు. ధర్మమార్గాన్ని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలిచాడు. ఆ సందర్భంలోనే ఆయన పాండవులకు సీతారాముల ప్రతిమలను ఇచ్చినట్టుగా చెప్పబడుతోంది. ఆ ప్రతిమలు పూజాభిషేకాలు అందుకుంటోన్న క్షేత్రంగా 'రామతీర్థం' దర్శనమిస్తుంది. విజయనగరం జిల్లాలో గల ఈ క్షేత్రం శ్రీరామచంద్రుడికి సంబంధించిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది.
పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతూ, ఎల్లవేళలా తమపట్ల అనుగ్రహాన్ని కలిగి ఉండమని కృష్ణుడిని ప్రార్ధిస్తారు. దాంతో ఆయన తాను రామావతారంలో సంచరించిన ప్రాంతంలో అరణ్యవాసాన్ని కొనసాగించమని పాండవులతో చెబుతాడు. సీతారాముల ప్రతిమలను ఇచ్చి, వాటిని పూజిస్తూ వుండటం వలన వారు కోరుకునే రక్షణ లభిస్తుందని అంటాడు. అలా పాండవులచే పూజించబడిన ఈ ప్రతిమలు ఆ తరువాత కాలంలో కనిపించకుండా పోయాయి. చాలాకాలం క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తురాలికి స్వప్నంలో రాముడు కనిపించి తన జాడను తెలియజేశాడు.
అదే సమయంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తోన్న రాజుకి కూడా కలలో కనిపించి తనకి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. అలా ఇక్కడి రాముడు వెలుగులోకి వచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడి చేతుల మీదుగా పాండవులు అందుకున్న ప్రతిమలు కావడం వలన, భక్తులకు సంకేతాలనిచ్చి వెలుగులోకి రావడం వలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.