భక్తుల కోసమే ఆవిర్భవించిన భద్రాద్రి రాముడు
శ్రీరామచంద్రుడు ఆవిర్భవించిన క్షేత్రాల్లో 'భద్రాచలం' ఎంతో ప్రత్యేకతను ... మరెంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. గోదావరి నదీతీరంలో గల ఈ క్షేత్రం రాముడు నడయాడిన పుణ్యభూమిగా దర్శనమిస్తూ వుంటుంది. అనేక విశేషాలను ఆవిష్కరిస్తూ వుంటుంది. శ్రీరాముడు నాలుగు భుజాలను కలిగి వుండటం ... సీతమ్మవారిని ఎడమతొడపై కూర్చుండబెట్టుకుని దర్శనమివ్వడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా కనిపిస్తూ వుంటుంది.
రాముడు భక్తజన బాంధవుడు అనడానికి అనేక నిదర్శనాలు వున్నాయి. 'భద్రుడు' అనే భక్తుడికి ఇచ్చిన మాటమేరకు రాముడు సీతా సమేతుడై లక్ష్మణుడితో పాటు, భద్రుడి శిరస్సుగా చెబుతోన్న ఇక్కడి కొండపై ఆవిర్భవించాడు. ఆ తరువాత తాను ప్రకటనమయ్యే సమయం వచ్చేవరకు స్వామివారు ఒక పుట్టలో ఉండిపోయాడు.
సమయం ఆసన్నం కాగానే 'పోకల దమ్మక్క' అనే భక్తురాలికి స్వప్నంలో దర్శనమిచ్చి తన అర్చామూర్తి జాడను తెలిపి వెలుగులోకి వచ్చాడు. ఇక గోపన్నను తహసీల్దారుగా ఆ ప్రాంతానికి రప్పించి ఆయన మనసును కట్టిపడేశాడు. ఆయన స్వప్నలో కనిపించి తనకి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. ఆలయం నిర్మించడమే కాకుండా సీతారామలక్ష్మణులకు అనేక ఆభరణాలను ఆయన చేయించాడు.
ఇందుకు ప్రభుత్వ సొమ్మును ఉపయోగించినందుకు గోల్కొండ తానీషా ఆగ్రహానికిగురై గోపన్న చెరసాల పాలవుతాడు. తన కోసం అనేక కష్టాలను అనుభవించిన గోపన్నను విడిపించడానికి లక్ష్మణుడితో సహా రాముడు మారువేషంలో వచ్చి, ఆరులక్షల బంగారు మొహరీలను తానీషకి చెల్లించి వెళతాడు. వాటిలో ఒకటిగా చెప్పబడుతోన్న 'రామమాడ' ను ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. రాముడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనీ ... భక్తులకు ఆయన రక్షణగా నిలుస్తూ ఉంటాడనడానికి నిదర్శనంగా ఇది దర్శనమిస్తూ వుంటుంది.
అలా ఒక భక్తుడి కోరిక మేరకు ఇక్కడ వెలసి .. మరో భక్తురాలి ద్వారా వెలుగుచూసి .. ఇంకో భక్తుడి వలన ప్రతిష్టను పొందినవాడిగా రాముడు కనిపిస్తుంటాడు. తన దర్శనార్థం ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన మరుక్షణమే భక్తుల పాపాలను పటాపంచలు చేస్తూ పుణ్యఫలాలను అనుగ్రహిస్తూ వుంటాడు.