అలా శ్రీరాముడి దర్శనభాగ్యం లభించింది

భగవంతుడి సన్నిధికి చేరుకోవడానికీ ... ఆయన అనుగ్రహాన్ని పొందడానికి నవవిధ భక్తిమార్గాలలో ఎవరికి ఇష్టమైన మార్గాన్ని వాళ్లు ఆచరించారు. ఏ మార్గంలో తనని చేరడానికి భక్తులు ప్రయత్నించినా, వాళ్లని ఆత్మీయంగా భగవంతుడు ఆదరించిన తీరు అనేకమంది విషయంలో కనిపిస్తుంది. కొంతమంది భక్తులు నిరంతరం రామనామ స్మరణచేస్తూ ... ఆయనని ఆరాధిస్తూ వచ్చారు. ఇక మరికొంతమంది భక్తులు తమ వృత్తిని తాము కొనసాగిస్తూనే, రామనామస్మరణ చేస్తూ వచ్చారు.

అలాంటివారిలో 'కబీరుదాసు' ఒకరుగా కనిపిస్తాడు. కబీరుదాసు బట్టలునేస్తూ వాటిని అమ్మేయగా వచ్చిన డబ్బుతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అలా బట్టలు నేస్తూనే ఆయన రామనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. వృత్తిని దైవంగా భావించడమే కాకుండా .. ఆ వృత్తిని కొనసాగిస్తూనే రాముడిని ఆరాధించేవాడు. విచిత్రంగా .. మిగతా వారు నేసిన వస్త్రాల కంటే ఆయన నేసిన వస్త్రాలు ప్రత్యేకమైన కళను సంతరించుకుని అందరినీ ఆకర్షిస్తూ ఉండేవి.

అలా కష్టపడగా వచ్చిన డబ్బుతో ఆయన అతిథులను ఆదరిస్తూ భక్తుడిగా రాముడికి మరింత చేరువయ్యాడు. శ్రీరాముడిపట్ల ఆయనకి గల అసమానమైన భక్తే ఆయనని కవిని చేసింది. రాములవారితో పాటు ఆయన భక్తులందరి మనసులను అవి దోచుకున్నాయి. దైవారాధనకి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలని కొంతమంది అనుకుంటూ వుంటారు. అందువలన ఆ ప్రస్తావన వచ్చినప్పుడు తీరికలేదు ... ఓపికలేదు అని అంటూ వుంటారు. భగవంతుడి ఆరాధన అనేది ప్రత్యేకమైన పనిగా పెట్టుకోకపోయినా ... పనిచేస్తూనే ఆయనని ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందవచ్చనే విషయాన్ని కబీరుదాసు చాటిచెప్పాడు ... శ్రీరాముడి దర్శనభాగ్యంతో తరించాడు.


More Bhakti News