రామభజనతో జాగరణ

పూర్వం గ్రామీణులు తమ ఊరుదాటకుండా జీవనాన్ని కొనసాగించారు. వ్యవసాయ సంబంధమైన పనులు చేసే వాళ్లు ... కులవృత్తులు చేపట్టిన వాళ్లు చీకటిపడే సమయానికి తమ పనులు ముగించుకుని రామాలయానికి చేరుకునేవాళ్లు. అంతా కలిసి ఉత్సాహంగా భజనలు చేసేవాళ్లు. రాముడి గుణగణ విశేషాలను గురించి గొంతెత్తి పాడుతూ, ఉదయం నుంచి పడిన శ్రమను మరిచిపోతుండేవాళ్లు.

ఇక విశేషమైన పర్వదినాల్లో 'ఏకనామం' పేరుతో ఒకే నామాన్ని ఒకరి తరువాత ఒకరుగా చెబుతూ జాగరణ చేసే వాళ్లు. ఇలా జాగరణ చేయడమనేది 'శ్రీరామనవమి' రోజున కూడా కనిపిస్తూ వుంటుంది. రాములవారి ఆలయంలో శ్రీరామనవమికి మించిన పెద్ద పండుగ ఏవుంటుంది ? అందువల్లనే ఒక నియమంగా చెప్పబడకపోయినా, ఈ రోజున చాలా గ్రామాల్లో రాముడి భజనలతో జాగరణ చేస్తుంటారు.

వసంత నవరాత్రులు ఆరంభమైన దగ్గర నుంచి రాత్రివేళలో భజనలు చేస్తారు. ఇక నవమి రోజున మాత్రం భజనతోనే జాగరణ పూర్తి చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజున మధ్యాహ్న వేళలో సీతారాముల కల్యాణం ఎంతో సందడిగా జరుగుతుంది. ఆ సాయంత్రం సీతారాములకు గ్రామోత్సవం జరిపి ఇంటింటికీ హారతులు పడతారు. సాక్షాత్తు సీతారాములే తమ ఇంటికి వచ్చినంతగా సంతోషపడతారు. స్వామివారికీ ... అమ్మవారికి పవళింపు సేవను ఏర్పాటు చేస్తారు.

ఆ రాత్రికి అంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి రాముడి భజనలు చేస్తారు. రాముడి గురించి ఎవరికి తెలిసిన కీర్తనలు ... పాటలు వాళ్లు ఆలపిస్తారు. ఆ స్వామి నామాలను లయబద్ధంగా ఒకరు చెబుతూ వుంటే మిగతావాళ్లు అనుసరిస్తూ వుంటారు. అప్పుడు కలిగే ఆనందం ... అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఇలా శ్రీరామనవమి రోజున భజనలతో జాగరణ చేయడం వలన సీతారాముల అనుగ్రహం లభిస్తుందనీ, విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వసిస్తుంటారు.


More Bhakti News