ఈ శకునం శుభసూచకమే !
ఏదైనా ఒక ముఖ్యమైన పనిమీద ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నప్పుడు, శకునం చూసుకుని బయలుదేరుతూ వుంటారు. కాస్త ఆలస్యమైనా మంచి శకునం చూసుకునే అడుగు బయటికి పెడుతుంటారు. ఇలా మంచి శకునం చూసుకుని బయలుదేరడం వలన, వెళ్లిన పని సఫలీకృతమవుతుందనే విశ్వాసం పూర్వకాలం నుంచీ వుంది. ఎవరికి వాళ్లు తాము తలపెట్టేకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తికావాలనే ఆశిస్తారు. అందుకే శకునానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు.
ఈ నేపథ్యంలో కొన్ని శకునాలు మంచివిగా ... మరికొన్ని శకునాలు అందుకు విరుద్ధమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇక కార్యసిద్ధిని కలిగించే శకునాలలో పూలు - పండ్లు కనిపిస్తూ వుంటాయి. సాధారణంగా దైవదర్శనానికి వెళ్లాలని అనుకోగానే ముందుగా గుర్తుకువచ్చేది పూలు .. పండ్లే. భగవంతుడిని పూలతో అలంకరిస్తూ .. అర్చిస్తూ వుంటారు. ఆయనకి వివిధరకాలైన పండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు.
ఇక శుభకార్యాలలోను పూలు - పండ్లకి ప్రధానమైన స్థానం ఇవ్వబడుతుంది. ఇవి లేకుండా శుభకార్యమనేది జరగనే జరగదు. దీనినిబట్టి పూలు - పండ్లు ఎంతటి శుభప్రదమైనవో అర్థంచేసుకోవచ్చు. అందువలన పూలబుట్టతో గానీ .. పండ్లబుట్టతో గాని ఎవరైనా ఎదురురావడం శుభసూచకంగా విశ్వసించడం జరుగుతోంది. పూలతోను ... పండ్లతోను కూడిన శకునం మంచిదిగా భావించి వెంటనే బయలుదేరవచ్చని స్పష్టం చేయబడుతోంది.