శ్రీరామచంద్రుడి మనసు అలాంటిది

ఇతరుల కోసం ఎన్ని కష్టాలనైనా అనుభవించడానికి శ్రీరాముడు సిద్ధపడతాడు కానీ, తన గురించి ఇతరులు ఇబ్బందిపడవలసివస్తే మాత్రం ఆయన ఎంతగానో బాధపడతాడు. సీతారామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరినప్పుడు, రాముడులేని రాజ్యంలో తాము వుండలేమంటూ అయోధ్యవాసులు అనుసరిస్తారు.

వాళ్లను గట్టిగా వారిస్తే బాధపడతారని భావించిన రాముడు, వాళ్లు నిద్రలోకి జారుకున్న తరువాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక రాజ్యానికి తిరిగి రమ్మంటూ భరతుడు కోరితే, అతని మనసు ఎంతమాత్రం నొచ్చుకోకుండా సున్నితంగా మాట్లాడతాడు. తనపైగల అభిమానంతో తల్లి మనసును బాధపెట్టవద్దని చెబుతాడు. ఇక తన కోసం రావణసేనతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వానర వీరులను చూసి కూడా రాముడు ఎంతగానో బాధపడతాడు.

ఆ వానర వీరులందరినీ బతికించవలసినదిగా ఆయన దేవేంద్రుడిని ప్రార్ధిస్తాడు. దాంతో దేవేంద్రుడు అమృతవర్షాన్ని కురిపించి, మృతులైన వానరులను బతికిస్తాడు. అప్పుడు రాముడి మనసు స్థిమితపడుతుంది. ఇలా అంతా సుఖసంతోషాలతో ఉండాలనే మంచిమనసున్నవాడిగా అందాలరాముడు కనిపిస్తూ వుంటాడు. అందరి రాముడుగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.


More Bhakti News