ఆలుమగలంటే సీతారాములే
ఎవరైనా భార్యాభర్తలు ప్రేమకి ప్రతీకలుగా ... అనురాగానికి ఆనవాళ్లుగా వుంటే, ఆ దంపతులను సీతారాములతో పోల్చుతూ వుంటారు. ఎందుకంటే అన్యోన్యత విషయంలో లోకానికి ఆదర్శప్రాయం సీతారాములే. ఏ విషయంలోనైనా భార్యాభర్తల మధ్య అవగాహన వుండాలి. ఒకరి అభిప్రాయానికి ఒకరు విలువనిస్తూ ముందుకుసాగాలి. ఒకరి మనసుకి ఒకరు కష్టం కలగకుండా చూసుకోవాలి.
ఇవన్నీ కూడా మనకి సీతారాముల్లో కనిపిస్తాయి. అయోధ్యలో అందమైన జీవితాన్ని ఊహించుకుని వచ్చిన సీత, రాముడు అడవులకి వెళ్లాలనే నిర్ణయమైనప్పుడు శాంతాన్నే పాటిస్తుంది. తనతో బయలుదేరమని సీతతో రాముడు అనలేదు. ఈ విషయంలో సీత అభిప్రాయం తెలుసుకుని .. ఆమె మనస్పూర్తిగానే తనతో అడవులకి రావడానికి సిద్ధమైనదని నిర్ధారణకి వచ్చాకనే అంగీకరిస్తాడు.
వనవాసకాలంలో కష్టాలను రాముడి సన్నిధిలో సీత ఇష్టంగా భరించిందే తప్ప, ఏనాడూ భోగభాగ్యాలను గురించిన ప్రస్తావన తీసుకురాలేదు. ఇక బంగారులేడి కోసం రాముడు వెళ్లడం, భార్య ముచ్చట తీర్చడానికి ఆయన చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. లంకానగరం నుంచి తీసుకువెళతానని సీతతో హనుమంతుడు అంటే, రాముడు వచ్చి తీసుకువెళ్లడమే తనకి గౌరవము ... ఆయనకి కీర్తి అని చెబుతుంది.
రావణుడిని సంహరించిన అనంతరం సీతను అలాగే అయోధ్యకి తీసుకువస్తే, లోకనిందకి గురికావలసి వస్తుందని భావించిన రాముడు ఆమెకి అగ్నిపరీక్ష పెడతాడు. రాముడి మనసు అర్థంచేసుకున్న సీత, అంతే శాంతమూర్తిగా ఆయన మాటని శిరసావహిస్తుంది. ఇలా సీతారాములలో ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమ .. అనురాగం ... విశ్వాసం మాటల్లో చెప్పలేనివిగా కనిపిస్తుంటాయి. అడుగడుగునా వారి ఆదర్శభావాలను అందంగా ఆవిష్కరిస్తుంటాయి.