సీతారాముల కల్యాణాన్ని తిలకిస్తే చాలు
శ్రీరామనవమి రోజున పల్లే - పట్నం అనే తేడా లేకుండా అన్ని రామాలయాలు భక్తజన సందోహంతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. సున్నం వేయబడిన ఆలయం ... రంగులుదిద్దబడిన రథం మనసుకు ఏదో తెలియని సంతోషాన్ని కలిగిస్తూ వుంటుంది. సాధారణంగా ఈ రోజుల్లో ఎండలు అధికంగా వుంటాయి కనుక, స్వామివారి కల్యాణోత్సవం జరిగే ప్రదేశమంతా 'చలువ పందిళ్లు' వేస్తుంటారు.
కల్యాణోత్సవ వేడుక కనిపించేలా కల్యాణమంటపం ఎదురుగా భక్తులు బారులు తీరి కూర్చుంటారు. ఇది లోకకల్యాణం కోసం జరిగే కల్యాణం. వీక్షించినవారి పాపాలను నశింపజేసి పుణ్యఫలాలను ప్రసాదించే కల్యాణం. అందుకే ప్రతి ఒక్కరూ సీతారాముల వివాహవేడుకలో తమవంతు సందడి చేస్తుంటారు.
శ్రీరామనవమి రోజున మారుమూల గ్రామంలోగల రామాలయం నుంచి మహాపుణ్యక్షేత్రాల వరకు, వడపప్పు - పానకం ప్రసాదంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తూ వుంటారు. ఈ రోజున చాలామంది 'చలివేంద్రాలు' ఏర్పాటు చేసి భక్తుల దాహాన్ని తీరుస్తుంటారు. మరికొందరు 'విసన కర్రలు' దానంగా ఇస్తూ వుంటారు.
ఎండలు విపరీతంగా వుండటం వలన, పానకం - వడపప్పు తగిన ఉపశమనాన్ని కలిగించి అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయని చెప్పబడుతోంది. ఇక మంచినీళ్లు కూడా అందుబాటులో ఉండేలా చేస్తారు. ఇలా మంచినీటిని దానం చేసినవారి పాపాలు నశించిపోవడమే కాకుండా, ఏ జన్మలోను మంచినీటిని కోసం తపించే పరిస్థితి ఏర్పడదని చెబుతారు.
ఇక ఉక్కబోత విపరీతంగా వుండే ఈ సమయంలో 'విసన కర్రలు' దానంగా ఇవ్వడం వలన కూడా అదేవిధమైన ఫలితం కలుగుతుందని అంటారు. ఇలా శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణోత్సవాన్ని చూడటం వలన, మంచినీటినీ ... విసనకర్రలను దానంగా ఇవ్వడం వలన సకలశుభాలు కనుగుతాయని స్పష్టం చేయబడుతోంది.