ఈ రోజున పార్వతీదేవిని ఆరాధించాలి

ప్రకృతిమాతగా ... జగాలకి తల్లిగా పార్వతీదేవి చెప్పబడుతోంది. స్త్రీ కోరుకునే వివాహయోగం ... సంతాన సౌభాగ్యాలను అందించే తల్లిగా పూజించబడుతోంది. అలాంటి పార్వతీదేవి పుట్టినరోజుగా 'చైత్రశుద్ధ అష్టమి' చెప్పబడుతోంది. పార్వతికి ముందుజన్మలో అమ్మవారు పరమశివుడి అర్ధాంగి అయిన 'సతీదేవి' గా దర్శనమిస్తుంది.

దక్షుడి కూతురైన సతీదేవి, మహాదేవుడికి మనసిచ్చి మనువాడుతుంది. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. శివుడిని అవమానించాలనే ఉద్దేశంతో ఆయనకి తప్ప అందరికీ ఆహ్వానాన్ని పంపిస్తాడు. తండ్రి నుంచి ఆహ్వానం లేకపోయినా అక్కడికి వెళ్లిన సతీదేవికి ఆయన అసలు ఉద్దేశం అర్థమవుతుంది. భర్త మనసుకి కష్టం కలిగించి వచ్చినందుకు సతీదేవి బాధపడుతుంది. అవమానభారంతో తిరిగి వెళ్లడం ఇష్టం లేక యోగాగ్నిలో ప్రవేశిస్తుంది.

ఆ తరువాత అమ్మవారు హిమవంతుడి కుమార్తెగా జన్మిస్తుంది ... పార్వతి నామధేయంతో పెరుగుతుంది. అలా అమ్మవారు పార్వతిగా జన్మిచిన చైత్ర శుద్ధ అష్టమి రోజున ఆ తల్లిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన అమ్మవారి అనుగ్రహంతో అనంతమైన ఫలితాలు లభిస్తాయి.

ఇక ఇదే రోజున అశోక వృక్షాన్ని కూడా పూజించాలని చెప్పబడుతోంది. అందువలన ఈ రోజుని 'అశోకాష్టమి' అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజున అశోక వృక్షాన్ని ఆరాధించడం వలన సమస్త బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News