అడుగడుగునా ఆదుకునే దేవుడు
వెన్నెలకన్నా చల్లనైన ... వెన్నకన్నా సున్నితమైన మనసున్నవాడిగా భగవంతుడు కనిపిస్తుంటాడు. సమస్త వైభవాల మధ్య తులతూగుతూ వుండే ఆ భగవంతుడు, భక్తుడి ఒకే ఒక్క పిలుపుకి వాటన్నింటిని పక్కనపెట్టి పరిగెత్తుకు వస్తాడు. కష్టాల్లో వున్నవారు భగవంతుడిని తలచుకుంటూ నిద్రపోతరేమో గానీ, ఆ భక్తుల కష్టాలను తీర్చేంత వరకూ ఆయన మాత్రం విశ్రమించడు. భక్తుల కోసం భగవంతుడు ధరించిన రూపాలు ... ప్రదర్శించిన లీలావిశేషాలు అన్నీఇన్నీకావు.
ఒకే భక్తురాలి కోసం ఆయన భిన్నమైన రూపాలను ధరించడం చూస్తే, తనని విశ్వసించిన వాళ్లని భగవంతుడు ఎంతగా కనిపెట్టుకుని ఉంటాడనేది అర్థమవుతుంది. సక్కుబాయికి పండరీపురంలోని పాండురంగస్వామి దర్శనం చేసుకోవాలనే కోరిక బలంగా వుంటుంది. అందుకు అత్తగారు అడ్డుపడుతూ ఉండటంతో, ఆ స్వామియే దగ్గరుండి సక్కుబాయిని పండరీపురం పంపిస్తాడు. ఆమె రూపంలో ఆ ఇంట్లో తాను వుంటాడు.
ఇక సక్కుబాయి 'చంద్రభాగ' నది సమీపానికి చేరుకునే సరికి అక్కడ పడవలవాళ్లు ఎవరూ కనిపించరు. ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం చేసుకుందామా అనే ఆరాటం వలన, ఆమె అక్కడ ఎక్కువసేపు నిలవలేక పోతుంటుంది. అయితే ఆ గట్టువైపు వచ్చే ఒక్క పడవా కనిపించకపోవడం వలన, తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనవుతుంది. అదే సమయంలో ఒక పడవవాడు వచ్చి ఆమెని అవతల తీరానికి చేరుస్తాడు. పాండురంగస్వామి దర్శనం కోసం పరుగు పరుగున వెళుతున్న సక్కుబాయిని చూస్తూ పడవవాడి రూపంలో వచ్చిన ఆ స్వామి మురిసిపోతాడు.
అలా సక్కుబాయి రూపంలో ఆమె అత్తవారింట్లో వున్న స్వామి, ఆమెని నది దాటించడం కోసం పడవనడిపేవాడిగా కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు భక్తుల వెన్నంటే ఉంటాడనీ, వాళ్లకి సాయాన్ని అందించడంలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడనటానికి నిదర్శనంగా ఇలాంటి సంఘటనలెన్నో కనిపిస్తుంటాయి. పరమాత్ముడి లీలావిశేషాలుగా పరవశింపజేస్తుంటాయి.