శ్రీరామనవమి ఉత్సవాల దర్శన భాగ్యం
విద్య .. ఉద్యోగం .. వ్యాపారం .. వివాహం .. ఇలా ఒక్కో కారణంగా ఒక్కొక్కరు తమ గ్రామానికి దూరమవుతూ వుంటారు. ఎవరు ఎక్కడ స్థిరపడినా తమ గ్రామానికి వెళ్లాలనే ఆరాటం ఒక సందర్భంలో మాత్రం తప్పక కలుగుతుంది. ఆ సందర్భమే ' శ్రీరామనవమి'. తాము పుట్టిపెరిగిన గ్రామాన్నీ ... అక్కడి రామాలయాన్ని ఎవరూ మరిచిపోలేరు. ఆ గుడిచుట్టూ అల్లుకున్న ఎన్నో ఆనందాలు ... అనుభూతులు ఈ సందర్భంలో మనసు తలుపుతడుతూ వుంటాయి.
తమ గ్రామంలోని సీతారాములు తమకోసం ఎదురుచూస్తూ వుంటారనే ఆలోచన కలిగితే వెంటనే అక్కడికి బయలుదేరకుండా ఎవరు మాత్రం ఉండగలరు ? ఇక ఆయా గ్రామాలలో గల రామాలయాల విశిష్టతనుబట్టి, మూడురోజులు .. అయిదు రోజులు ... తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుపుతుంటారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా సీతారాములు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ వాహన సేవల్లో పాల్గొనడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రామాలలో హనుమంతుడి వాహనం ... గరుడ వాహనం ... రథోత్సవం తప్పనిసరిగా కనిపిస్తుంటాయి.
హనుమంతుడి వాహనసేవలో పాల్గొనడం వలన అనారోగ్యాలు ... గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అలాగే గరుడ వాహనసేవలో పాల్గొనడం వలన ఆరోగ్యవంతులైన సంతానం కలుగుతుంది. ఇక రథోత్సవంలో పాల్గొనడం వలన సకల మనోభీష్టాలు నెరవేరతాయి. అందువలన శ్రీరామనవమి ఉత్సవాల్లోని వాహనసేవల్లో పాల్గొనడం మరిచిపోకూడదు. భగవంతుడి వైభవాన్ని ఉత్సవాల్లోనే చూడాలి ... ఆయన అనుగ్రహాన్ని కూడా ఆ సమయంలోనే పొందాలి.