హనుమ అనుగ్రహాన్ని అందించే పూలు

భగవంతుడిని ఏదో ఒకటి కోరుకునే భక్తి ఎంతోకొంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక భగవంతుడి నుంచి ఏమీ కోరనప్పుడు .. ఆయన సేవచేసుకునే భాగ్యం తప్ప మరేమీ ఆశించనప్పుడు కలిగే సంతోషం వేరు ... సంబరం వేరు. ఇవి మనకి హనుమంతుడిలో స్పష్టంగా కనిపిస్తాయి. సాక్షాత్తు నారాయణుడి స్వరూపమైన రాముడిని ప్రత్యక్షంగా సేవించుకునే అదృష్టం కలిగినందుకే హనుమంతుడు మురిసిపోయాడు.

సీతారాములు ప్రీతిచెందడం కోసమే ఆయన సిందూరం ధరించాడనీ, తమలపాకుల మాలను ధరించాడని అంటారు. అందుకే హనుమంతుడిని ఎవరైతే అనునిత్యం సేవిస్తూ వుంటారో, అలాంటివారికి తమ అనుగ్రహం తప్పక లభిస్తుందని సీతారాములు సెలవిచ్చారు. అలాంటి హనుమంతుడు అనేక క్షేత్రాల్లో అర్చామూర్తిగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఇక ఆయన ప్రతిమను పూజామందిరంలో ఏర్పాటు చేసుకుని అనుదినం పూజించుకునేవారు లేకపోలేదు.

ఇక హనుమంతుడికి పూలంటే మహాఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మల్లెలు .. సన్నజాజులు .. సంపెంగలు .. పొగడలు .. పొన్నాగులు .. మందారాలు .. కనకాంబరాలు .. గులాబీలు మరింత ఇష్టమట. హనుమంతుడికి ప్రీతికరమైన ఈ పూలతో ఆ స్వామిని పూజించడం వలన ఆయన ఎంతో సంతోషపడతాడు.

ధర్మాన్ని రక్షించడం కోసం తన పరాక్రమాన్ని ఉపయోగించే ఆయన, తన అనుగ్రహాన్ని భక్తులపై అపరిమితంగా కురిపిస్తుంటాడు. హనుమంతుడికి ఇష్టమైన పూలతో ఆయనని సేవించడం వలన భూత ప్రేత పిశాచ బాధలు ... గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోవడమే కాకుండా, ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... విజయాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News