ఎలాంటి పూజ ఆశించిన ఫలితాన్నిస్తుంది ?
కాలం మారిపోతూ వుంది ... పరిస్థితులు మారిపోతున్నాయి. దాంతో జీవితం ఉరుకులు .. పరుగులుగా సాగిపోతోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారి పరిస్థితి ఇందుకు మరింత దగ్గరగా వుంటుంది. అయినా వాళ్లు ఉదయాన్నే నిద్రలేచి .. భగవంతుడి పూజకి అవసరమైన పూలు కోసి .. పూజామందిరం దగ్గర కూర్చుని ఇష్ట దైవాన్ని పూజిస్తూ వుంటారు. అనునిత్యం దైవానికి ఏదో ఒక నైవేద్యం ఉండేలా చూస్తారు.
పూజామందిరాలు ఎక్కువగా వంటగదిలో ఒక భాగంగా కనిపిస్తూ వుంటాయి. పూజామందిరం దగ్గర కూర్చునే ప్రదేశం కూడా తక్కువగానే వుంటుంది. వంటగదిలో నుంచి అటు ఇటు తిరిగేవారికి ఇబ్బంది కలుగుతుందేమోననే ఉద్దేశంతో, పూజను హడావిడిగా చేయడం జరుగుతూ వుంటుంది. ఇక పూజ చేస్తూ వుండగా తమ కోసం ఎవరైనా వస్తే వెంటనే లేచి వెళ్లడం వంటివి చేస్తుంటారు.
ఇక కొంతమంది పూజామందిరం దగ్గర కూర్చుని అష్టోత్తరం ఆరంభించి, ఆ తరువాత అక్కడి నుంచి లేచి వేరేపనులు చేస్తూ నామాలు పూర్తిచేస్తుంటారు. ఇక పూజ చేస్తూనే మధ్య మధ్యలో కుటుంబసభ్యులకు కొన్ని సూచనలు చేస్తూ తిరిగి పూజలోకి వెళ్లేవాళ్లూ లేకపోలేదు. ఇలా గందరగోళంలో పూజ చేయడం వలన ఎలాంటి ప్రయోజనం వుండదు. పువ్వులు లేనిదే కాదు ... ప్రశాంతత లేకుండా చేసేది కూడా పూజ అనిపించుకోదు.
భగవంతుడి ప్రతి నామం శక్తిమంతమైనదిగా ... విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. అలాంటి నామాలను మనస్ఫూర్తిగా చెబుతూ అర్చించాలి. ఆ శక్తితో కూడిన దైవం యొక్క రూపాన్ని మనోఫలకంపై నిలుపుకుని ఆరాధించాలి. మధ్యలో వచ్చే అంతరాయలకి స్పందించకుండా ... మధ్యలో ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా పూజ పూర్తిచేయాలి. ఇది ఒక నియమంగా పెట్టుకుంటే పాటించడం పెద్దకష్టమేమీ కాదు.
పూజ చేయడానికి కావసింది పూలు - పండ్లు మాత్రమే కాదు, అంతకన్నా ప్రధానమైనవి భక్తిశ్రద్ధలు అనే విషయాన్ని గ్రహించాలి. ఇలా దైవం ఏదైనా చేసే పూజా మనస్ఫూర్తిగా వుండాలి. దైవం పట్ల అసమానమైన విశ్వాసాన్ని ఆవిష్కరిస్తూ ఆరాధించాలి. అప్పుడు దైవం ప్రీతిచెందడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుంది ... పరిపూర్ణమైన ఫలితం దక్కుతుంది.