అదంతా శ్రీరామచంద్రుడి ప్రభావమే !
సాధారణంగా ఒకే తల్లి గర్భాన జన్మించినా ఆ పిల్లలందరి మనస్తత్వాలు ఒకేలా వుండవు. ఎవరిదారి వారిది ... ఎవరితీరు వారిది అన్నట్టుగానే వుంటారు. ఎవరి వాటాకు ఎంత రాబోతుందీ ... ఏం రాబోతుంది అనేదానిపైనే దృష్టిపెడుతుంటారు. ఇక తల్లులు వేరైతే ఆ పరిస్థితి కూడా వేరే వుంటుంది. అయితే రాముడి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది.
రాముడు .. లక్ష్మణుడు .. భరత శత్రుఘ్నుల తల్లులు వేరు. అయినా రాముడి వలన తమ ప్రతిభాపాటవాలను ఎవరూ గుర్తించడంలేదని వాళ్లు ఎప్పుడూ బాధపడలేదు. రాముడు అడవులకు వెళుతున్నాడని ఆనందపడలేదు .. ఆ సింహాసనం తమకి దక్కుతుందని ఆశపడనూ లేదు. అప్పటి వరకూ రాముడు వారిపట్ల చూపుతూ వచ్చిన ప్రేమాభిమానాలే అందుకు కారణం.
తన నడవడికతో రాముడు వాళ్లని అంతగా ప్రభావితం చేశాడు. రాముడు వారించినా వినిపించుకోకుండా లక్ష్మణుడు ఆయనని అనుసరించాడు. అంతకిమించి వారిస్తే లక్ష్మణుడి మనసు మరింత గాయపడుతుందని భావించి రాముడు మౌనం వహిస్తాడు. ఇక భరతుడి విషయానికే వస్తే, రాముడి లేని రాజ్యం తనకి రాళ్లగుట్టతో సమానమని తేల్చి చెప్పేస్తాడు.
పదవులు .. పట్టాభిషేకాలు తనకి అవసరం లేదనీ, సీతారాములు తిరిగివచ్చే పండుగరోజు కోసం ఎదురుచూస్తూ ఉంటానని అంటాడు. రాముడు తిరిగి వచ్చేంత వరకూ ఆయన పాదుకలను సింహాసనంపై వుంచి పరిపాలనను కొనసాగిస్తాడు. సోదరుడి కోసం కన్నతల్లిని ఎదిరించిన తీరు భరతుడి విషయంలో కనిపిస్తుంది. ఇక శతృఘ్నుడు కూడా లక్ష్మణ .. భరతుల మాదిరిగానే రాముడి పట్ల అసమానమైన ప్రేమాభిమానాలను కనబరుస్తాడు. అందుకే ఒక కొడుకుగా .. శిష్యుడిగా .. భర్తగా .. ప్రభువుగా మాత్రమే కాదు, సోదర ప్రేమ విషయంలోనూ రాముడి గొప్పతనం కనిపిస్తుంది ... అది ప్రతి ఒక్కరి మనసుని అందంగా హత్తుకుపోతుంది.