అదే శ్రీరాముడి గొప్పతనం
అయోధ్యవాసులకే కాదు రామచంద్రుడు అంటే అందరికీ ఇష్టమే. అందుకుకారణం సత్యధర్మాల పట్ల ఆయనకిగల గౌరవం .. అందరిపట్ల ఆయన కలిగివుండే మృధు స్వభావం. తల్లి .. తండ్రి .. గురువు .. దైవం .. భార్య . . సోదరులు .. బంధువులు .. మిత్రులు .. ప్రజలు ఇలా ఆయన ఎవరికి ఇవ్వవలసిన విలువను వారికి ఇస్తూ వచ్చాడు.
ఎప్పుడు ఎవరినీ ఏ విధంగాను ఆయన నొప్పించి ఎరుగడు. తొందరపడి మాట్లాడటం ... తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం రాముడిలో కనిపించదు. ఏది జరిగినా అది కర్మఫలితమనే భావించేవాడే తప్ప, అందుకు బాధ్యులను చేస్తూ ఎవరినీ నిందించలేదు. భరతుడి ధోరణి వలన కైకేయి మనసు మార్చుకున్నా ... భరతుడు ప్రాధేయపడినా ఆయన వెనుదిరిగే ఆలోచన చేయలేదు.
సుగ్రీవుడి కంటే వాలి బలవంతుడని తెలిసినా, సీతాన్వేషణ విషయంలో వాలి సాయాన్ని కోరలేదు. ఎందుకంటే తాను ఆశించే ధర్మమార్గంలో వాలి లేకపోవడమే అందుకు కారణం. అందువల్లనే వాలిని సంహరించి సుగ్రీవుడికి సహకరిస్తాడు. వాలి చనిపోయిన తరువాత సీతాన్వేషణకి ఎలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టకుండా సుగ్రీవుడు కాలం గడుపుతూ వుండటం రాముడికి అసహనాన్ని కలిగిస్తుంది.
వాలిని సంహరించిన అస్త్రం ఏదైతే వుందో అది ఇంకా తన అమ్ములపొదిలోనే వుందనే విషయాన్ని గుర్తుచేసుకోమని లక్ష్మణుడితో సుగ్రీవుడికి కబురు చేస్తాడు. ఎంతో అర్ధంగల విషయాన్ని రాముడు ఒక్క మాటలో చెప్పగలడనటానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. ఇక రావణుడి సోదరుడే అయినా విభీషణుడు ధర్మమార్గంలో ప్రయాణంచేస్తూ ఉన్నందువల్లనే రాముడు ఆయన్ని చేరదీస్తాడు.
ఇన్ని రోజులుగా ఇంతలా కష్టపెట్టాడనే ఆగ్రహాన్ని కూడా రావణుడిపై రాముడు చూపలేదు. రాయబారాలు విఫలమైన తరువాతే రంగంలోకి దిగుతాడు. నిస్సహాయుడిగా మిగిలిన రావణుడిని సంహరించకుండా, ఇప్పటికైనా మనసు మార్చుకోమని చెబుతూ ఆలోచించుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఇలా నిర్మలత్వం ... నిలకడ తత్త్వం కలిగిన ధర్మస్వరూపుడిగా రాముడు దర్శనమిస్తూ వుంటాడు. కాలాలు మారుతున్నా ప్రతిఒక్కరి హృదయంలోను ఆదర్శమూర్తిగా .. అవతారమూర్తిగా వెలుగొందుతూనే వుంటాడు.