రామనామ మహాత్మ్యం అలాంటిది !
జీవితం అనేకమైన మలుపులు తిరుగుతూ సాగిపోతూ వుంటుంది. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితమే జీవితాలను ప్రభావితంచేస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో తమ కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వహించడమే జీవితానికిగల అర్థంగా కొంతమంది భావిస్తుంటారు. జీవితాన్ని ఇచ్చినదే భగవంతుడు కాబట్టి దానిని ఆయన పాదసేవలో తరింపజేసుకుందామని కొందరు అనుకుంటారు.
ఇక ఒక వైపున సంసార సాగరాన్ని ఈదుతూనే మరోవైపున దైవారాధనని కొనసాగించడమే ఉత్తమమైనదని మరికొందరు విశ్వసిస్తుంటారు. ఇలా ఎవరికివారు తాము అనుసరించే మార్గాన్నిబట్టి ఆ స్వామిని సేవిస్తూ వుంటారు. దైవారాధనతో పాటు కుటుంబానికి ప్రాధాన్యతను ఇచ్చేవాళ్లు, ఆరోగ్యం .. ఐశ్వర్యం .. విజయం .. సంతానం .. సౌభాగ్యం ఇలాంటి వరాలను భగవంతుడిని కోరుతుంటారు.
ఇక భగవంతుడి పాదాలను ఆశ్రయించినవారు మాత్రం, ఇవేమీ పట్టించుకోకుండా స్వామి సేవకే తమ జీవితాన్ని అంకితం చేస్తుంటారు ... మోక్షాన్ని మాత్రమే కోరుతుంటారు. ఇలా తమ పరిస్థితులను బట్టి ... పరిపక్వతను బట్టి కోరిన వరాలను అందించే శక్తివంతమైన మాత్రంగా 'రామనామం' చెప్పబడుతోంది. సూర్యకిరణాలు చీకటిని ఎలా పారద్రోలుతూ ఉంటాయో ... రామనామం కూడా అలాగే పాపాలను పటాపంచలుచేస్తూ వుంటుంది. కెరటాలు ఏ విధంగా నిరంతరం తీరం వైపుకు పరుగులుతీస్తూ వుంటాయో, అలాగే రామనామం కూడా తనని ఆశ్రయిచినవారిని ముక్తి తీరానికి చేరుస్తూ వుంటుంది.
రామనామం అందరికీ లభించిన అక్షయపాత్ర వంటిది. ధర్మబద్ధంగా ఎవరు దేనినైతే కోరతారో అదే దాని నుంచి లభిస్తుంది. సంసారమనే సాగరాన్ని చేరినవారిని రామనామమే అవతల తీరానికి చేరుస్తూ వుంటుంది. అలాంటి రామనామ మహాత్మ్యం గురించి హనుమంతుడు ఈ లోకానికి చాటిచెప్పాడు. ఇక విభీషణుడు .. శబరి .. పోతన .. తులసీదాసు .. కబీరుదాసు .. రామదాసు వంటి మహాభక్తులు ఆ స్వామి నామస్మరణలో తడిసినవారే .. తరించినవారే.