అంతా రామమయమే
శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడిగా ... ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా కనిపిస్తాడు. తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు ... గురువుల పట్ల భక్తిభావం ... పెద్దల పట్ల గౌరవం ... పిన్నల పట్ల ప్రేమ ... భార్యపట్ల అనురాగం ... సోదరుల పట్ల ఆత్మీయత ... ప్రజల పట్ల అభిమానం .. ధర్మం పట్ల అంకితభావాన్ని ఆవిష్కరించాడు.
ఇలా అనేక మంచి లక్షణాల కలబోతగా రామచంద్రుడు దర్శనమిస్తూ వుంటాడు. అలాంటి రాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్లాడు. అందుకు గుర్తుగా ఆయా ప్రదేశాల్లో రామాలయాలు నిర్మితమవుతూ వచ్చాయి. రామచంద్రుడి అడుగుజాడలను ఆవిష్కరించే ఈ క్షేత్రాలు భక్తులపాలిట కల్పతరువై అలరారుతున్నాయి.
'తిరుపతి' లో జాంబవంతుడి ప్రతిష్ఠగా చెప్పబడుతోన్న రామాలయం .. సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశంగా చెప్పబడుతోన్న కడపజిల్లా 'ఒంటిమిట్ట' ... సీతారామ లక్ష్మణులు నడయాడిన 'భద్రాచలం' ... రామాయణంలోని కొన్ని ఘట్టాలను కళ్లకు కట్టే ఖమ్మం జిల్లాలో గల 'రామగిరి' ... సీతమ్మవారి అన్వేషణకుగాను బయలుదేరిన వానర సైన్యం నాలుగు భాగాలుగా విడిపోయిన ప్రదేశంగా ప్రకాశం జిల్లా 'చదలవాడ' దర్శనమిస్తుంటాయి. ఇవన్నీ కూడా రాముడి పాదస్పర్శని పొందిన పవిత్ర క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
ఇలా రామాయణంలో చెప్పబడుతోన్న ఘట్టాలు జరిగిన ప్రదేశాలు ఎన్నో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తూ వుంటాయి. అక్కడి రామాలయాలు అపారమైన భక్తివిశ్వాసాలకు ప్రతీకలుగా కనిపిస్తూ వుంటాయి. రాముడు నడయాడిన ప్రదేశాలను గురించిన పరిశీలన చేసుకుంటే, అంతదూరం ప్రయాణించడం ఎలా సాధ్యమైందనే ఆశ్చర్యం కలగకమానదు. ఆయా ప్రదేశాల్లో గల రామాలయాలను దర్శించుకున్నప్పుడు ... అక్కడి లీలా విశేషాలను గురించి తెలుసుకున్నప్పుడు అంతా రామమయమేనని అనిపించక మానదు.