ఈ రోజున లక్ష్మీదేవిని ఇలా పూజించాలి

ప్రస్తుతం అనుభవిస్తోన్న జీవితం గతజన్మలో చేసుకున్న పుణ్యఫలమని భావిస్తూ వుండాలి. అలాగే రానున్న జన్మ కూడా ఈ జన్మలో చేసుకున్న పుణ్యఫలాలపైనే ఆధారపడి వుంటుంది. అందుకే సాధ్యమైనంత వరకూ చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ, దానధర్మాలు చేస్తూ పుణ్యఫలాలను అర్జించాలి. ఆ పుణ్యఫలాలను బట్టే భగవంతుడి అనుగ్రహం వుంటుంది.

పుణ్యరాశి తరిగిపోయేంతవరకే లక్ష్మీదేవి కూడా వుంటుంది. ఆ తరువాత ఆమె ఆ స్థానాన్ని వదిలి వెళ్లిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు పుణ్యరాశిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ వుండాలి. ఇతరులకు సాయం చేయడం వలన మనకేం వస్తుంది ? అని కొంతమంది అనుకుంటూ వుంటారు. ఆ సాయమే భగవంతుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందనీ ... లక్ష్మీ కటాక్షానికి కారణమవుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం వలన అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది ... అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్లనే ఒక వైపున పుణ్యకార్యాలలో పాల్గొంటూ .. మరోవైపున లక్ష్మీదేవిని ఆరాధిస్తూ వుండాలి. అలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందించే విశేషమైన రోజుల్లో ఒకటిగా 'చైత్రశుద్ధ పంచమి' కనిపిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో 'దవనం' తో పూజించాలి.

వేడిని తట్టుకుని చల్లదనంతో పాటు సువాసనను అందించే సహజ లక్షణాన్ని దవనం కలిగివుంటుంది. అందువలన దవనం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ రోజుల్లో దవనం విరివిగా దొరకడం కూడా దైవానుగ్రహమే. అలాంటి దవనంతో అమ్మవారిని ఈ రోజున అర్చించడం వలన ఆ తల్లి కటాక్షం ఆరాధించినవారిని చేరుతుంది. అలాంటివారి ఇల్లు సిరిసంపదలకు నిలయంగా మారుతుంది.


More Bhakti News