ఏదైనా దైవానుగ్రహంతోనే సాధ్యం
జీవితంలో ఎదుగుదలనే అందరూ కోరుకుంటూ వుంటారు. అందుకోసం ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు. ఇక ఎవరు ఎలాంటి విజయాన్ని సాధించాలన్నా ప్రత్యక్షంగానో ... పరోక్షంగానో ఇతరుల సహాయ సహకారాలు అవసరమవుతూ వుంటాయి. అయితే తీరా విజయం సాధించాక, అందుకు కారణమైనవారిని కొంతమంది మరిచిపోతుంటారు. తన కృషితో మాత్రమే పైకి వచ్చినట్టుగా నలుగురికీ గొప్పగా చెప్పుకుంటారు.
ఇలాంటివారికి సాయం చేసినవాళ్లు .... మారిన ధోరణిని చూసి బాధపడతారు. మరోమారు తమ నుంచి సహాయ సహకారాలు అందించకూడదని నిర్ణయించుకుంటారు. ఇక తాము పడిన కష్టం కారణంగానే అభివృద్ధిని సాధించమని చెప్పుకునేవాళ్లు, అందుకు భగవంతుడి అనుగ్రహం కూడా తోడైందని అంగీకరించరు. తమ కష్టానికి తగిన ఫలితం మాత్రమే లభించిందని చెబుతారు.
ఒకవేళ ఏ విషయంగానైనా ఎదురుదెబ్బ తగిలితే మాత్రం అందుకు కారణం తామేనని చెప్పుకోకుండా, దైవం అనుకూలించలేదని ఆయనపై తోసేస్తుంటారు. ఇలా విజయాలు వరించినప్పుడు తమ గొప్పతనంగా చెప్పుకుంటూ .. అపజయాలు ఎదురైనప్పుడు అందుకు దేవుడిని బాధ్యుడిని చేస్తుంటారు. ఇలా అహంభావంతో వ్యవహరించేవారినీ ... అవకాశాన్నిబట్టి ప్రవర్తించేవారిని భగవంతుడు చూస్తూనే వుంటాడు.
తన పేరు ప్రతిష్ఠల కోసం దైవం ఎప్పుడూ పాకులాడదు. కానీ చేసిన సాయాన్ని మరిచిపోయి విశ్వాసానికి విలువనీయని వాళ్లు తగిన ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడు. అహంభావంతో భగవంతుడిని విస్మరించినవాళ్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందనడానికి నిదర్శనంగా పురాణాల్లోని అనేక సంఘటనలు కనిపిస్తుంటాయి. అందువలన శ్రమ చేస్తూనే భగవంతుడి అనుగ్రహాన్ని కోరుకోవాలి. విజయం పలకరిస్తే తన శ్రమను భగవంతుడు గుర్తించాడని భావించాలి. అపజయం ఎదురైతే అది తన ప్రయత్న లోపంగా విశ్వసించాలి. అప్పుడే ప్రయతాన్ని మరింత తీవ్రతరం చేసి దైవానుగ్రహంతో వరుస విజయాలను అందుకునే అవకాశం కలుగుతుంది.