ఈ రోజున ఆదిదంపతులను ఇలా ఆరాధించాలి

పార్వతీ పరమేశ్వరులు జగాలకే తల్లిదండ్రులు. వాళ్ల అనుగ్రహం కారణంగానే ప్రకృతి నుంచి సమస్త జీవరాశులకు కావలసిన ఆహారం అందుతూ వుంటుంది. వాళ్ల చల్లని చూపువల్లనే సమస్త జీవరాశి తమ మనుగడను సాధించగలుగుతోంది. అందుకే అంతా ఆదిదంపతులను ఆరాధిస్తూ వుంటారు. ఆయా ప్రదేశాల్లో ఆవిర్భవించిన ఉమా మహేశ్వరులను దర్శించి సేవిస్తుంటారు.

చల్లని మనసున్న అమ్మవారినీ ... అమ్మమనసుతో పోటీపడే అయ్యవారిని అనునిత్యం సేవించడమే కాదు, ఒక సందర్భంలో వారిని ఊయలలో వేసి ఊపుతూ ముచ్చట తీర్చుకోవడం కూడా కనిపిస్తూ వుంటుంది. ఆ రోజే 'చైత్రశుద్ధ తదియ' గా చెప్పబడుతోంది. ఉల్లాసభరితమైన ... భక్తిభరితమైన ఈ వేడుకను స్త్రీలంతా కలిసి, 'డోలాగౌరీ వ్రతం' పేరుతో జరుపుతుంటారు.

సదాశివుడిని భర్తగా పొందడం కోసం పార్వతీదేవి చేసిన తపస్సు ఈ రోజున ఫలించిందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దక్షుడి కూతురుగా జన్మించిన సతీదేవి, తన తండ్రి ఉద్దేశం తన భర్తను అవమానపరచడమేనని తెలుసుకుని యోగాగ్నిలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత హిమవంతుని ఇంట ఆమె 'పార్వతి' గా జన్మిస్తుంది. పరమశివుని సేవపట్ల దృష్టి నిలిపిన ఆమె, ఆయనని భర్తగా పొందాలని భావిస్తుంది.

అందుకోసం ఆమె కఠోరమైన తపస్సును ఆచరించి ఆదిదేవుడి మనసు గెలుచుకుంటుంది. అలాంటి ఈ రోజున ఉదయం వేళలో భక్తి శ్రద్ధలతో ఆదిదంపతులను పూజించాలి. సాయంత్రం వేళలో పేరంటాళ్లను పిలిచి, పరమేశ్వరుడితో కూడిన పార్వతీదేవిని ఊయల ఊపుతూ పాటలు పాడాలి. ఉమామహేశ్వరులను ఊయలలో వేసి ఊపడమనే వేడుకను నిర్వహించడం వలన, వారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని అంటారు. ఆదిదంపతులు ప్రీతిచెందడం వలన సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని విశ్వసిస్తుంటారు.


More Bhakti News