ఉగాది రోజున ఆవునెయ్యి దీపారాధన

చైత్రశుద్ధ పాడ్యమి నుంచి తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున 'ఉగాది' పర్వదినంగా అంతా జరుపుకుంటూ వుంటారు. మామిడి తోరణాలతో ప్రతి ఇల్లు మంగళకరంగా అలంకరించబడి వుంటుంది. కొత్తసంవత్సరం సందర్భంగా బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలుపుకోవడంలో తీరికలేకుండా వుంటారు. ఒకవైపున వేపపూత పచ్చడి ... మరో వైపున సంప్రదాయబద్ధమైన పిండివంటలు భగవంతుడి నైవేద్యానికిగాను సిద్ధమవుతూ వుంటాయి.

ఈ రోజున ఉదయాన్నే తలంటుస్నానం చేసి .. సంప్రదాయబద్ధమైన కొత్తవస్త్రాలను ధరించి .. పూజా మందిరాన్ని భక్తిశ్రద్ధలతో అలంకరిస్తారు. ఎవరి ఇష్టదైవాన్ని వారు ఈ రోజున పూజిస్తూ వుంటారు. ఏ పూజకైనా ముందుగా చేయవలసింది దీపారాధనే. దీపారాధన చేయడం వలన సగం ఫలితం వచ్చేస్తుందని చెప్పబడుతోంది. అయితే ఈ దీపారాధన దేనితో చేయాలనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది.

ఎందుకంటే కొన్ని పర్వదినాల్లో నువ్వులనూనె ... మరికొన్ని పర్వదినాల్లో కొబ్బరినూనె .. అలాగే ఆవునెయ్యిని దీపారాధనకు ఉపయోగిస్తూ వుంటారు. ఆయా విశేషాలను బట్టి ఒక్కొక్క తైలంతో దీపారాధన చేయాలనీ, దీపారాధనకు ఉపయోగించే తైలం కూడా ఫలితంపై ప్రభావం చూపుతుందనే ప్రస్తావన ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 'ఉగాది' రోజున 'ఆవునెయ్యి' తో దీపారాధన చేయాలని చెప్పబడుతోంది.

ఈ రోజున అయిదువత్తులు కలిగిన రెండు దీపపు కుందులను పూజామందిరంలో రెండువైపులా వుంచి, ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది. అలా ఆవునెయ్యితో దీపారాధన చేసి .. వివిధరకాల పుష్పాలతో పూజించి .. ఫలాలను సమర్పించడం వలన భగవంతుడు ప్రీతిచెందుతాడు. ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తాడు.


More Bhakti News