రామాయణ పఠన ఫలితం
రామాయణం అంటే రాముడు నడచిన మార్గంగా చెప్పుకోవచ్చు. ఆయన అనుసరించినది ధర్మమార్గం. ఆ మార్గంలో ఆయన ఎన్నోకష్టాలు అనుభవించాడు. అయినా ధర్మాన్ని ఆశ్రయించినవారిని అది తప్పకుండా కాపాడుతుందని నిరూపించడం కోసం ఆయన అన్ని బాధలను ఆనందంగా అనుభవించాడు. తండ్రి మాటకి కట్టుబడి కారడవులకు ప్రయాణమయ్యాడు.
ఇక భర్త అడుగుజాడలను అనుసరించడమే భార్య యొక్క విధిగా భావించి సంతోషంగా సీత ఆయన వెనుక నడించింది. భార్య ఊర్మిళను ఊరడించి లక్ష్మణుడు కూడా అన్నావదినలకు తోడుగా అడవులకి నడిచాడు. ఆ తరువాత దశరథుడు మరణించడం .. తల్లి ధోరణి పట్ల భరతుడు అసహనాన్ని ప్రదర్శించడం ... వాళ్లు వచ్చి ప్రాధేయపడినా రాముడు తన నిర్ణయం మార్చుకోకపోవడం జరుగుతాయి.
ఆ తరువాత సీతను రావణుడు అపహరించడం ... హనుమంతుడి ద్వారా రామలక్ష్మణులు సుగ్రీవుడి మైత్రిని సాధించి, వానరసైన్యం సాయంతో రావణుడిని సంహరించడం జరుగుతుంది. ప్రతి సంఘటన కూడా ధర్మంపట్ల రాముడికిగల అంకితభావాన్ని ఆవిష్కరిస్తూ వుంటుంది. అంతిమవిజయం ధర్మానిదే అనే సత్యాన్ని లోకానికి చాటుతూ వుంటుంది.
ఎవరికివారు తమ జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి రామాయణం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి రామాయణ కావ్యాన్ని 'వాల్మీకీ మహర్షి' ఇరవైనాలుగు వేల శ్లోకాలతో రచించాడు. అత్యంత శక్తిమంతమైన గాయత్రీ మంత్రంలో ఇరవైనాలుగు అక్షరాలు వుంటాయి. ప్రతి వెయ్యి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున వాల్మీకి మహర్షి ఉపయోగిస్తూ వచ్చాడు. అలా ఇరవైనాలుగు వేల శ్లోకాలు .. ఇరవైనాలుగు అక్షరాలు గల గాయత్రీ మంత్రంతో కలిసివుంటాయి.
అందువలన ఎవరైతే రామాయణాన్ని చదువుతారో, వాళ్లకి గాయత్రీ మంత్రాన్ని జపించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. రామాయణాన్ని చదివినవారికి సీతారాముల అనుగ్రహం లభిస్తుంది. అందులోని గాయత్రీ మాత్రం కూడా పఠించినట్టు అవుతుంది కనుక, ఆ తల్లి కటాక్షం కూడా ప్రాప్తిస్తుంది. ఫలితంగా అన్ని విషయాల్లోనూ కాపాడబడుతూ సకలశుభాలను పొందుతుంటారు.