మనసున్న తల్లి మహంకాళమ్మ

లోకకల్యాణం కోసం అమ్మవారు అనేక రూపాలను ధరిస్తూ వచ్చింది. అలా వివిధ రూపాలలో కొలువైన అమ్మవారు, అనేక నామాలతో పిలవబడుతోంది. అలాంటి పేర్లలో ఒకటిగా 'మహంకాళి' కనిపిస్తుంది. అమ్మవారికి గల ఈ పేరే ఆ తల్లిని మహాశక్తి స్వరూపిణిగా ఆవిష్కరిస్తూ వుంటుంది. అలా ఆ తల్లి మహంకాళి అమ్మవారిగా కొలువైన ఆలయాలలో ఒకటి హైదరాబాద్ - వనస్థలిపురంలో కనిపిస్తుంది.

ప్రసిద్ధిచెందినటువంటి గణపతి ఆలయానికి సమీపంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. రహదారి పక్కనే నిర్మించబడిన ఈ ఆలయం, చక్కగా తీర్చిదిద్దబడి వుంటుంది. గర్భాలయంలో మహంకాళి అమ్మవారి మూలమూర్తి తేజస్సుతో వెలిగిపోతూ వుంటుంది. అమ్మవారికి ఎదురుగా .. ఆ తల్లి ఆదేశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా సింహవాహనం కనిపిస్తుంది.

ఇక్కడ నిత్య పూజలతో పాటు, వివిధరకాల జపాలు ... శాంతి హోమాలు జరుపుతుంటారు. అమ్మవారు ఎక్కడ కొలువైనా ఆ తల్లి పాదాలను ఆశ్రయించేవారిలో మహిళా భక్తులే ఎక్కువగా వుంటారు. జీవితంలో స్త్రీ కోరుకునే వరాలలో వివాహం ... సంతానం .. సౌభాగ్యం ముఖ్యమైనవిగా చెప్పబడుతూ వుంటాయి. వీటినే శాశ్వతమైన సంపదలుగా భావించి వాళ్లు సంతోష పడుతుంటారు ... సంతృప్తిని పొందుతుంటారు.

అలాంటి వరాలను అందించే తల్లిగా మహంకాళి అమ్మవారు దర్శనమిస్తుంది. స్త్రీలు కోరుకునే జీవితాన్ని అందించడానికి అమ్మవారు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. అనారోగ్యాలను ... ఆర్ధికపరమైన ఇబ్బందులను తొలగించి, వివాహయోగాన్ని కలిగించడమే కాకుండా సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. అందుకు కృతజ్ఞతగా అమ్మవారిని భక్తులు అనుదినం సేవిస్తుంటారు. ప్రతి శుక్రవారం పూజాభిషేకాలు జరుపుతుంటారు. పర్వదినాల్లో అమ్మవారికి చీరసారెలను సమర్పిస్తుంటారు. ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను చేయించి, ఆమె ప్రేమానురాగాలకు పాత్రులవుతుంటారు.


More Bhakti News