వీటికి దూరంగా వుంటే చాలు !
కొంతమందికి కొన్ని బలహీనతలు వుంటాయి. వాటి కారణంగా అనారోగ్యానికి గురికావడం .. సిరిసంపదలను కోల్పోవడం .. పరువుప్రతిష్ఠలకు భంగం కలగడం జరుగుతూ వుంటుంది. ఇక పొగడ్తలపట్ల ఆసక్తి చూపడమనేది వీటన్నిటినీ దూరంచేసే బలహీనతగా కనిపిస్తుంది. చూడటానికి ఇది భయంకరమైన బలహీనతగా కనిపించకపోయినా, చేయవలసినంత చెడును తాపీగా చేసేస్తుంటుంది.
పొగడ్త చాలా తియ్యగా వుంటుంది .. అది అందించే ఆనందం హాయిగా వుంటుంది. అందుకే పొగడ్తలను ఇష్టపడేవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎందులో విజయాన్ని సాధించినా ... లాభాలను రాబట్టినా, పొగడ్తలతో ముంచెత్తేందుకు కొంతమంది సిద్ధమైపోతారు. తమ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్లలా పొగుడుతుంటారు.
కొంతమంది ఇలాంటి పొగడ్తలను ఎంతమాత్రం ఇష్టపడరు. సద్విమర్శలను చేసే వాళ్లను మాత్రమే వాళ్లు గౌరవిస్తారు. తరువాత సాధించవలసిన పనిపైనే వాళ్లు దృష్టిపెడతారు. ఇక కొంతమంది ఆ పొగడ్తల వలలో పడిపోతుంటారు. సమష్టి కృషి వల్లనే తాము ఆ స్థాయికి చేరుకున్నామనే విషయాన్ని పొగడ్తల వలన మరిచిపోతారు.
తమ తెలివితేటలు ... ధైర్యసాహసాల కారణంగానే విజయమనేది సొంతమైందని భావిస్తారు. తాము తీసుకునే నిర్ణయం ఎప్పుడూ సరైనదేననే అహంభావానికి లోనవుతారు. ఫలితంగా నష్టాలపాలై కష్టాలు పడతారు. పొగడ్తలనేవి శక్తికి మించిన ఆలోచనలు చేయడానికి కారణమవుతూ వుంటాయి. నిజానిజాలు ఆలోచించే అవకాశం లేకుండా చేస్తుంటాయి. తాముచేసేదే సరైనదనే నమ్మకాన్ని బలంగా కలిగిస్తుంటాయి. దాంతో జరగవలసిన నష్టం జరిగిపోతుంటుంది.
ఆ బాధను చెప్పుకోవాలనుకున్నా, అప్పటివరకూ పొగిడినవాళ్లలో ఒక్కరు కూడా కంటికి కనిపించరు. మరొకరి దగ్గర వాళ్లు ఇదే పనిలో వుంటారు. పొగడ్తలు ఎప్పుడూ తియ్యగానే వుంటాయి ... పొగిడే బృందాలు ప్రతిచోటా వుంటాయి. అలాంటి పొగడ్తలకు పొంగిపోకుండా ఉంటేచాలు, ఆనందం .. అభివృద్ధి ఎప్పుడూ తోడుగా వస్తూనే వుంటాయి. స్వార్థపరులను దగ్గరికి రానీయకుండా తమ శక్తికి తగిన నిర్ణయాలు తీసుకుంటూ వెళితే చాలు విజయాలు వరిస్తూనే వుంటాయి.