బాబా చెప్పినట్టుగానే జరిగేదట !
శిరిడీలోని మశీదులోవుంటూ .. అయిదు ఇళ్లలో భిక్ష చేసుకుంటూ సాయిబాబా కాలం గడుపుతూ ఉండేవాడు. మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, ఆయనలోని సేవాగుణం నిదానంగా అక్కడివారిని కదిలించింది. బాబా చూపే ప్రేమానురాగాలు ... ఆయన కారణంగా తగ్గుతోన్న వ్యాధులు అక్కడివారిలో మరింత విశ్వాసాన్ని పెంచాయి.
తమ ఆపదలు ... అనారోగ్యాలు ఆయన వలన తొలగిపోవడాన్ని అక్కడివారు గ్రహించారు. దాంతో బాబాని విశ్వసించేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. కొన్ని సంఘటనలు ఆయన మహిమలుగా ప్రాంతాలను దాటి వెళ్లాయి. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆయన దర్శనం కోసం వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. అలా వచ్చినవారిలో కొందరు తాము కొన్నిరోజులు ఆయన సన్నిధిలో ఉండటానికి వచ్చామని అనేవారు.
అయితే వాళ్లు అక్కడ రెండు రోజులు మాత్రమే ఉండగలరని బాబా చెప్పేవాడు. ఆయన అన్నట్టుగానే ఏదో అత్యవసరమైన కబురు వచ్చి వాళ్లు మూడోరోజునే వెళ్లిపోవలసి వచ్చేది. ఇక మరి కొందరు బాబా దర్శనం చేసుకుని తాము వెంటనే ఊరుకి బయలుదేరుతున్నట్టు చెప్పేవారు. రెండు రోజులపాటు వాళ్లు శిరిడీలోనే ఉండవలసి వస్తుందని బాబా అనేవాడు. ఆయన చెప్పినట్టుగానే ఏదో ఒక ఆటంకం ఏర్పడి వాళ్లు శిరిడీలో ఉండిపోవలసి వచ్చేది.
ఇక బాబా మాటల్లోని ఆంతర్యాన్ని అర్థంచేసుకోకుండా బయలుదేరినవాళ్లు, అనుకోని ఆటంకాలు ఎదురై గత్యంతరంలేని పరిస్థితుల్లో వెనుదిరిగి శిరిడీ వచ్చేసిన సందర్భాలు లేకపోలేదు. ఎవరు ఎప్పుడు శిరిడీ చేరుకున్నా ... తిరిగి అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరినా అది బాబా నిర్ణయమేనని ఈ సంఘటనలు నిరూపిస్తూ వుంటాయి. ఇదే విషయాన్ని బాబా భక్తులు ఇప్పటికీ నమ్ముతుంటారు.