కష్టాల నుంచి గట్టెక్కించే బాబా
శిరిడీలో శిధిలావస్థలోగల ఒక మశీదుని తన నివాసస్థానంగా ఎంచుకున్న బాబా, ప్రేమతో భక్తుల మనసులను గెలుచుకుంటూ వెళ్లాడు. శిరిడీ మొత్తాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చివేశాడు. మశీదులోని 'ధుని' దగ్గర కూర్చునే, ఎక్కడో మారుమూల ఏదో ఆపదలో చిక్కుకున్న భక్తులను సైతం ఆయన రక్షించాడు. ఔషధాలకు లొంగని వ్యాధులను కేవలం స్పర్శమాత్రంచేత నివారించాడు.
స్వప్నంలోనే భక్తులకు దర్శనమిచ్చి చికిత్సలు చేశాడు. తనపై విశ్వాసం ఎక్కడ వుంటే తాను అక్కడ ఉంటానని చెప్పాడు. అలా సమాధిచెందిన అనంతరం కూడా ఆయన తన లీలావిశేషాలను ఆవిష్కరిస్తూనే వున్నాడు. ఆయనతో ఏర్పడిన అనుబంధం కారణంగానే అనేక ప్రదేశాల్లో బాబా ఆలయాలు నిర్మితమవుతూ వస్తున్నాయి.
కొన్నిచోట్ల ఇతర ఆలయాల ప్రాంగణంలో ఆయన మందిర నిర్మాణాలు జరుగుతూ వుండగా, మరికొన్ని చోట్ల ప్రత్యేకంగా ఆయన ఆలయాలు నిర్మితమవుతూ వస్తున్నాయి. ఈ ఆలయాలన్నీ గురువారం రోజున భక్తజన సందోహంతో దర్శనమిస్తున్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి హైదరాబాద్ - 'హయత్ నగర్' లో దర్శనమిస్తుంది. హైదరాబాద్ లో చాలాకాలనీల్లో బాబా ఆలయాలు కనిపిస్తుంటాయి. అక్కడి భక్తుల అంకితభావానికి అవి ప్రతీకలుగా అనిపిస్తుంటాయి.
అలాగే హయత్ నగర్ లోని బాబా ఆలయం కూడా భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. అభిషేకాలు .. అలంకారాలు .. హారతులు ఇక్కడ నిత్యం జరుగుతుంటాయి. గురువారాల్లోను ... పర్వదినాల్లోను ప్రత్యేకపూజలు .. సేవలు నిర్వహిస్తుంటారు. కష్టాలు .. బాధలు .. సమస్యలు .. ఇబ్బందులు .. మొదలైనవాటితో సతమతమైపోయేవాళ్లని గట్టెక్కించడం బాబా సహజలక్షణం.
తనపట్ల విశ్వాసముంచి .. తనపై భారాన్ని మోపితే ఆయన ఆనందంగా తన సహాయాన్ని అందిస్తాడు. బాబా వలన అనేక కష్టాల నుంచి విముక్తిని పొందిన భక్తుల జీవితాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతూ వుంటుంది. అలాగే ఇక్కడి బాబా పాదాలను ఆశ్రయించడం వలన, ఎలాంటి కష్టం నుంచైనా గట్టెక్కడం జరుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఆయన సేవయే ఆశించిన వరాలను అందిస్తుందనే ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.