ఉగాది పచ్చడి వలన కలిగే ఫలితం

ఉగాది పండుగ రోజున ప్రతి ఇల్లు మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ప్రతి పూజామందిరం అందంగా అలంకరించబడి పవిత్రతకు ప్రతీకగా అనిపిస్తుంది. ఇక ఈ రోజున దేవాలయాలన్నీ భక్తులరాకతో సందడిగా కనిపిస్తుంటాయి. కొత్త సంవత్సరపు తొలిరోజున దైవదర్శనం చేసుకుని తీర్థంగా ఉగాది పచ్చడిని స్వీకరించడం శుభప్రదమని అంతా భావిస్తుంటారు.

ఉగాది రోజున తలంటుస్నానం .. దైవారాధన ... వేపపూత పచ్చడిని స్వీకరించడం .. దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణ కార్యక్రమానికి వెళ్లడం ముఖ్యమైన విధులుగా చెప్పబడుతున్నాయి. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటుస్నానం చేసి .. కొత్తబట్టలను ధరించి .. భగవంతుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించిన వేపపూత పచ్చడిని పరగడుపుతో సేవించాలి.

తాజాగా కోసిన వేపపూత .. కొత్తబెల్లం .. కొత్త చింతపండు .. మామిడికాయ .. ఉప్పు .. పచ్చిమిరపతో ఉగాది పచ్చడిని కొత్తకుండలో తయారుచేస్తుంటారు. కొందరు కొబ్బరిముక్కలు .. చెరుకుముక్కలు .. ద్రాక్షపండ్లు .. అరటిపండ్ల ముక్కలను కూడా జోడిస్తుంటారు. ఇలా ఆరురకాల రుచులతో ఉగాదిపచ్చడిని తయారుచేసుకుని పరగడుపుతో ప్రసాదంగా స్వీకరించడం వెనుక ఆరోగ్యపరమైన కారణమే ప్రధానమైనదిగా కనిపిస్తుంది.

చర్మసంబంధమైన వ్యాధులను 'వేప' నివారిస్తుంది. ముఖ్యంగా వసంతరుతువులో సోకే అంటువ్యాధుల బారినుంచి ఇది కాపాడుతుంది. ఈ కాలంలో వుండే తీవ్రమైన వేడిని కొత్తబెల్లం నియంత్రిస్తుంది. వేపతో కలిపిన కొత్త బెల్లాన్ని స్వీకరించడం వలన అనేక అనారోగ్యాలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇక జీర్ణక్రియ చురుకుగా పనిచేయడానికి చింతపండు తోడ్పడుతుంది. పచ్చిమిరప .. ఉప్పు కూడా తగినంత మోతాదులో ఉపయోగించడం వలన ఆరోగ్యానికి సహకరిస్తాయి.

ప్రకృతి నుంచి వచ్చిన తొలిపూతను .. కాతను ఉగాదిపచ్చడిగా భగవంతుడికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం వలన అనేక దోషాలు నశిస్తాయి. ఎన్నో ఔషధ గుణాలను కలయిక అయిన ఈ పచ్చడిని స్వీకరించడం వలన ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యానికి మించిన భాగ్యంలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఆధ్యాత్మికపరమైన ఆహ్లాదాన్ని అందించడమే కాకుండా, ఆ ఏడాది ఎవరెవరు ఏయే విషయాలయందు జాగ్రత్తగా వ్యవహరించాలనేది శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని సూచిస్తుంది. ఇలా మానవాళికి అన్నిరకాలుగాను శుభాలను .. సంతోషాలను ఇచ్చే విశిష్టమైన పర్వదినంగా ఉగాది కనిపిస్తుంది.


More Bhakti News